Begin typing your search above and press return to search.

కేంద్రం న‌న్నేమైనా చేస్తే ప్ర‌జ‌లే న‌న్ను కాపాడాలి-బాబు

By:  Tupaki Desk   |   25 April 2018 6:27 AM GMT
కేంద్రం న‌న్నేమైనా చేస్తే ప్ర‌జ‌లే న‌న్ను కాపాడాలి-బాబు
X
ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు కామెంట్ల‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న‌ను పోరాట యోధుడిగా అభివ‌ర్ణించుకునే చంద్ర‌బాబు బేల‌త‌నం చూపుతూ చేస్తున్న కామెంట్లు అంద‌రికీ విస్మ‌యంగా అనిపిస్తున్నాయి. కేంద్రంపై పోరాటం చేస్తున్నానంటూనే...త‌న‌పై కుట్ర జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని...బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని ఎదుర్కునే స‌మ‌యంలో ఇలాంటి ఆటుపోట్లు స‌హ‌జ‌మ‌నే చిన్న లాజిక్‌ ను బాబు తెలియ‌దు అని ఎలా అనుకుంటామ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ కామెంట్ల‌కు కార‌ణం ఏమిటంటే... తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చేసిన వ్యాఖ్య‌లే.

తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పరిధిలోని ద్వారపూడిలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్రసంగించారు. ప్రజలంతా బాగుండాలన్న ఉద్దేశంతోనే భాజపాతో చేతులు కలిపానని, ఇప్పుడు మోడీ మనను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా రావచ్చని, మీరంతా చైతన్యంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలంతా వలయంలా చుట్టూ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఆడుతున్న ఆటలకు అడ్డుకట్ట వేయాలంటే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లూ తెదేపా గెలుచుకుని ప్రధాని పదవిని నిర్ణయించే విధంగా ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మనం రాజీనామా చేసినా కేంద్రానికి నష్టం లేకపోవడంవల్లే మోడీ ఆటలు సాగుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు.

కాగా, తాను దేనికైనా సిద్ధ‌మ‌ని, స‌మ‌స్యలు త‌న‌కు కొత్త కాద‌ని, ఎన్నో ఎదుర్కున్న అనుభ‌వం త‌న‌ద‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌టించుకునే చంద్ర‌బాబు తాజాగా ఇలా భ‌యకంపితులైన వ్యాఖ్య‌లు చేయ‌డం వెనుక మ‌ర్మం ఏంట‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. కేంద్రం త‌న‌ను ఏం చేయ‌లేద‌ని ప్ర‌క‌టించిన బాబు గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మ‌యంలో, ప్ర‌ధాన‌మంత్రి - హోం మంత్రితో భేటీ కానున్నార‌నే వార్త‌ల నేప‌థ్యంలో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిని సంత‌రించుకుంది.