Begin typing your search above and press return to search.

మూణ్నెళ్ల త‌ర్వాత 20కోట్ల ఆఫీసుకు బాబు!

By:  Tupaki Desk   |   26 Nov 2015 8:53 AM GMT
మూణ్నెళ్ల త‌ర్వాత 20కోట్ల ఆఫీసుకు బాబు!
X
సరైన ప్ర‌ణాళిక లేకుండా ఖ‌ర్చు చేస్తే.. విలువైన నిధులు ఎంతగా వృధా అవుతాయ‌న‌టానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది హైద‌రాబాద్ లోని ఏపీ స‌చివాల‌యంలోని సీఎం కార్యాలయాన్ని చెప్పొచ్చు. సార్వత్రిక ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ప‌దేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ నుంచే కొన్నేళ్లు పాల‌న‌ను అందించాల‌ని సీఎం చంద్ర‌బాబు భావించారు. దీనికి త‌గ్గ‌ట్లే హైద‌రాబాద్‌ లోని ఏపీ స‌చివాల‌యంలో త‌న కార్యాల‌యాన్ని భారీగా మార్పులు చేశారు. ఇందుకోసం దాదాపుగా రూ.20కోట్ల మేర ఖ‌ర్చు చేశారు. ఇంత భారీగా ఖ‌ర్చు చేయ‌టంపై అప్ప‌ట్లో భారీగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఇంత పెద్ద మొత్తంతో ముఖ్య‌మంత్రి త‌న కార్యాల‌యాన్ని ఆధునీక‌రించుకునే క‌న్నా.. ఏపీలో ఏదైనా భ‌వ‌నాన్ని నిర్మిస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. హైద‌రాబాద్‌ లో ఎంత‌కాలం ఉంటామో తెలీని ప‌రిస్థితుల్లో ఆధునీకీక‌ర‌ణ‌కు ఇంత భారీ మొత్తంలో నిధుల్ని వృధా చేయ‌టం మంచిది కాద‌న్న సూచ‌న వినిపించింది. విభ‌జ‌న కార‌ణంగా తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండికూడా.. ఇంత భారీ మొత్తం కేవ‌లం సీఎం ఛాంబ‌ర్ కోసం ఖ‌ర్చు చేయ‌టం ఏమిట‌న్న‌విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా.. ఏపీ సీఎం వెన‌క్కి త‌గ్గ‌లేదు.

ఇంత ఖ‌ర్చు చేసిన త‌ర్వాత కూడా ఆ భ‌వ‌నాన్ని వినియోగించే ప‌రిస్థితి లేకుండా పోయింది. రాజ‌కీయంగా మారిన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉన్న ప‌ళంగా బెజ‌వాడ‌కు షిఫ్ట్ అయిపోవ‌టంతో ఆయ‌న హైద‌రాబాద్ కు రావ‌ట‌మే త‌గ్గిపోయింది. ఒక‌వేళ‌.. వ‌చ్చినా ఉన్న ఒక‌రోజులో వివిధ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండ‌ట‌మో లేదంటే.. కుటుంబ స‌భ్యుల‌తో గ‌డ‌ప‌టంతోనే స‌రిపోయే ప‌రిస్థితి. దీంతో.. ఆయ‌న త‌న ఖ‌రీదైన ఆఫీసుకు రాలేని ప‌రిస్థితి.

దాదాపు మూడు నెల‌ల త‌ర్వాత (స‌రిగ్గా చెప్పాలంటే 83 రోజుల త‌ర్వాత‌) ఆయ‌న త‌న కాస్ట్లీ ఛాంబ‌ర్ కు వెళ్ల‌నున్నారు. గురువారం చిత్తూరు జిల్లాలోని త‌న స్వ‌గ్రామంలో జ‌రిగే త‌న మ‌న‌మ‌డి త‌ల‌నీలాల కార్య‌క్ర‌మానికి హాజ‌రై గురువారం రాత్రికి హైద‌రాబాద్ చేరుకోనున్నారు. శుక్ర‌.. శ‌ని.. ఆదివారాలు హైద‌రాబాద్‌ లోనే ఉండి.. సోమ‌వారం ఉద‌యం ఆయ‌న తిరిగి బెజ‌వాడ వెళ్ల‌నున్నారు. ఈ మ‌ధ్య‌లో శుక్ర‌.. శ‌నివారాల్లో స‌చివాల‌యానికి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాల్ని నిర్వ‌హిస్తార‌ని చెబుత‌న్నారు. అదే జ‌రిగితే.. బాబు త‌న ఛాంబ‌ర్ కు దాదాపు మూడు నెల‌ల త‌ర్వాత వెళ్లిన‌ట్లు అవుతుంది. ఈ మాత్రం దానికి ఛాంబ‌ర్ కోసం రూ.20కోట్ల ఖ‌ర్చు అవ‌స‌ర‌మా?