బాబు భవిష్యత్తుకోసం... టీటీడీపీ బలి!

Thu Nov 08 2018 20:00:01 GMT+0530 (IST)

తెలంగాణ ఎన్నికల్లో ఎన్నడూ లేనన్ని సంచలనాలు నమోదవుతున్నాయి. ఓడలు బళ్లు - బళ్లు ఓడలు అవుతున్నాయి. విభజనకు ముందు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉండేదో అందరికి తెలిసిందే. బీసీల దన్ను ఆ పార్టీని నిలబెట్టింది. తెలంగాణ ఏర్పాటుతో తెలుగుదేశంపై ఆంధ్రా పార్టీ ముద్ర పడటంతో ప్రాంతీయతత్వం తెలంగాణ బీసీలను పార్టీకి దూరం చేసింది. దీంతో లీడర్లు కూడా క్రమక్రమంగా పార్టీని వదిలేశారు. కొందరు టీఆర్ ఎస్ లోకి ఇంకొందరు కాంగ్రెస్ లోకి జంపయ్యారు. కేసీఆర్ తో స్నేహం కోసం ప్రయత్నించి విఫలమైన చంద్రబాబు ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ తో జతకట్టారు. ఇది రాజకీయంగా కలకలం అయినా... తెలంగాణ టీడీపీ శ్రేణులకు మాత్రం కొంత ఊపిరి పీల్చుకున్నట్లనిపింది. అయితే అంతలోనే బాబు రాజకీయం వారిని తీవ్ర నిరాశలోకి నెడుతోంది. బాబు వల్ల నిరాశ ఏంటి? అన్న అనుమానం కలుగుతుంది కదా. దటీజ్ బాబు. వివరంగా తెలుసుకుందాం.ఇపుడు ఆంధ్రాలో బాబు పాలన అన్నిరంగాల్లో విఫలం అయ్యింది. లోటు బడ్జెట్ ఒక కారణం అయితే తెలుగుదేశం నేతల అవినీతి - అధికారుల విచ్చలవిడితనం మరో కారణం. దీంతో ఏపీలో తెలుగుదేశానికి విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. మరోవైపు బీజేపీతో బంధం తెంచుకోలేక తెంచుకుంది టీడీపీ. అయితే అనూహ్యంగా దేశంలో జరిగిన కొన్ని మార్పుల వల్ల మోడీపై వ్యతిరేకత పెరగడంతో చంద్రబాబులో కొత్త ఆశ మొలకెత్తింది. ఇపుడు కనుక కాంగ్రెస్ తో కలిస్తే తన శక్తితో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవచ్చని కలలుకంటున్నారు చంద్రబాబు. దీనికోసం కాంగ్రెస్ చెప్పిన ప్రతిమాటకు ఊకొడుతున్నారు. ఎందుకు బాబు ఇంత దిగజారుతున్నారు అంటే... రేప్పొద్దున జగన్ సీఎం అయితే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అండ లేకపోతే తనపై అవినీతి కేసులు నమోదవుతాయోమో అన్నది చంద్రబాబు భయం. ఈ కారణంగా కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఇది చాలా మంది టీడీపీ శ్రేణులకు ఆంధ్రాలో నచ్చకపోయినా బాబుకు మాత్రం తప్పడం లేదు.

మీరు అడిగింది చేస్తా - అడిగినంత ఇస్తా.... ఎలాగైనా మీరు తెలంగాణలోనూ - కేంద్రంలోనూ అధికారంలోకి రావాలి అని చంద్రబాబు రాహుల్ గాంధీని - సోనియాగాంధీని అడుగుతున్నారట. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పెట్టిన ప్రతి రూలుకు చంద్రబాబు ఒప్పుకుంటారట. ఈ నియోజకవర్గాలు కావాలి అని కూడా బాబు అడగడం లేదట. పైగా జనాల్లో ఆదరణ లేని సీపీఐ - ఇటీవలే పుట్టిన కోదండరాం పార్టీ సీట్ల కోసం విపరీతంగా పట్టుపడుతుంటే  ఒకప్పుడు తెలంగాణలో అంత బలమైన పార్టీ... అయిన టీడీపీ కాంగ్రెస్ 14 సీట్లు ఇస్తే అదే ప్రసాదం అని తీసుకుందట. ఇంకా కావాలని డిమాండ్ కూడా చేయడం లేదు. తెలంగాణ టీడీపీ నేతలు 17 వరకు కోరుతున్నారు. ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబుతో సమావేశమైన నేతలు అడిగారట. అయితే ఎక్కువ సీట్లలో పోటీ చేయడం మన లక్ష్యం కాదని - ఇచ్చిన సీట్లలో గెలవడం - టీఆర్ ఎస్ ను ఓడించడం లక్ష్యమని చంద్రబాబు వారికి చెప్పారట. ఇది తెలంగాణ టీడీపీకి శరాఘాతం.  అయితే బాబు మాత్రం... కేంద్రంలో మోడీ ఉండకూడదు ఉంటే తనకు భవిష్యత్తు ఉండదు కాబట్టి... తెలంగాణ టీడీపీ నేతలను కాంగ్రెస్ ను ఏమీ అనొద్దనేశారట. కాంగ్రెస్ మీద ఈగ వాలినా బాబు ఒప్పుకోవడం లేదు. ఇది తెలంగాణ నేతల్లో తీవ్ర నిరాశను - అసంతృప్తిని నింపుతోంది. ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తే ఈరోజు పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ చేతిలోపెట్టేశారు తమ అధినేత అని వారు మదనపడిపోతున్నారట.