Begin typing your search above and press return to search.

ఏపీ ఆధార్... ఇది ఉంటే ఈజీ లివింగ్

By:  Tupaki Desk   |   30 July 2015 9:14 AM GMT
ఏపీ ఆధార్... ఇది ఉంటే ఈజీ లివింగ్
X
బ్యాంకు ఖాతాకు, వంట గ్యాస్ కు, ఓటరు కార్డుకు, డ్రైవింగు లైసెన్సు కు, చివరకు రైల్వే టిక్కెటుకు కూడా ఆధార్ కార్డే ఆధారం. ఇలా దేశంలో ప్రతి సేవకూ ఆధారమైన ఆధార్ కార్డు భారతదేశంలోని ప్రతి వ్యక్తికీ ప్రాథమిక అవసరంగా మారిపోయింది. ప్రజలకు విస్తృత ప్రయోజనాలు కల్పించేందుకు, సేవలు సులభతరం చేసేందుకు ప్రవేశపెట్టిన ఆధార్ కార్డు తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లోనూ ఓ ప్రత్యేక గుర్తింపు కార్డును ప్రజలందరికీ ఇవ్వడానికి చంద్రబాబు ప్లాను చే్స్తున్నారు. ప్రభుత్వ సేవలు సులభంగా పొందడానికి ఇది మంచి సాధనంగా మారుతుంది. దీనికోసం ఏపీ స్టేట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రెసిడెంట్సు పాలసీని తీసుకొస్తున్నారు. ఈ విధానం ప్రకారం ఏపీలో నివసించే ప్రతిఒక్కరికీ విశిష్ఠ గుర్తింపు సంఖ్య ఇస్తారు.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆధార్ కార్డు జారీలో ఎన్నో సమస్యల కారణంగా చాలామందికి ఇంకా ఆ కార్డు రాలేదు. అలాంటివారంతా నష్టపోకుండా ఇది పనికొస్తుంది. ఎవరూ ప్రభుత్వ పథకాలు, సేవలు కోల్పోకుండా ఈ కొత్త విధానం ఉపయుక్తంగా ఉంటుందన్నది ప్రణాళిక. ప్రతి ప్రభుత్వ పథకానికీ, సేవలకూ ఈ కొత్త నంబర్లను అనుసంధానిస్తారు. దీని ఆధారంగా ప్రతి సర్వీసు అందుతుంది. రాష్ట్రంలోని రెసిడెంట్ డా హబ్ ఆధారంగా ఈ కొత్త కార్డులు జారీ అవుతాయి. ఈ ప్రక్రియకు సన్నాహకంగా ఒక సర్వే చేపట్టనున్నారు. ఇది సమగ్రంగా ఉంటుంది... అనంతరం కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభవతుంది. సర్వే కోసం ప్రస్తుతం ఏర్పాటులు జరుగుతున్నాయి. అది పూర్తయితే ఏపీ రెసిడెంట్ కార్డ్స్ జారీ చేస్తారు.