Begin typing your search above and press return to search.

కేశవ్ బాబుకి అవసరం! కానీ బలయ్యేది ఎవరు?

By:  Tupaki Desk   |   27 Aug 2016 7:57 AM GMT
కేశవ్ బాబుకి అవసరం! కానీ బలయ్యేది ఎవరు?
X
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గ విస్తరణ గురించి సమాచారం ఇచ్చారు . పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని కొత్తగా ఎక్కువమందికే అవకాశాలు తలుపులు తడతాయని చంద్రబాబునాయుడు సంకేతాలు చెప్పారు. పునర్ వ్యవస్థీకరణలో పయ్యావుల కేశవ్ కి అవకాశం దక్కే ఛాన్స్ ఎక్కువగా వుంది. అసెంబ్లీ లో కేశవ్ అవసరం చంద్రబాబు కు వుంది. ప్రతిపక్షాల ను ధీటుగా ఎదుర్కునే సరైన నాయకుడు అసెంబ్లిలో లేకపోవడం ఒకింత లోపం గా వుంది చంద్రబాబుకి. మంత్రి అచ్చం నాయుడు అరిచి ఆవేశంగా మాట్లాడ్డం తప్పించి అందులో పస వుండటం లేదు. ఆయన ఆవేశం వల్ల కొన్నిసార్లు అధికార పక్షానికే ఇబ్బందికర పరిస్థితులు కలిగాయి. ఇక రెండో వ్యక్తి బోండా ఉమ. ఏకధాటిగా మాట్లాడగలడు కాని ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్ధం కాని పరిస్థితి. ప్రతిపక్షాన్ని సమర్ధవంతంగా ఎదురుకునే నాయకుడు లేక పోవడం చంద్రబాబుకు ఒకింత ఇబ్బందిగానే వుంది.

అనర్గళంగా మాట్లాడ్డం లో దిట్ట - సబ్జెట్ పరంగా - ప్రతిపక్షాల ఎత్తులను తిప్పిగొట్ట గల సమర్ధుడైన పయ్యావుల కేశవ్ కు అవకాశం దక్కవచ్చు. అయితే కేశవ్ కి మంత్రి పదవి ఇస్తే ఆ జిల్లాకి మూడు మంత్రి పదవులు ఇచ్చినట్టు అవుతుంది. ఒక జిల్లా నుండి ముగ్గురికి చోటు ఇవ్వడం సాధ్యం కాక పోవచ్చు. మరి వేటు ఎవరి మీద పడొచ్చు?. పల్లె రఘునాధ రెడ్డి కా లేక పరిటాల సునీతకా? పల్లె రఘునాధ రెడ్డి వేటు వేస్తే ఒక జిల్లా నుండి ఒకే కులం వాళ్ళు మంత్రులుగా వుండటం కుల సమీకరణాల పరంగా కరెక్ట్ కాదు. మరి వేటు పరిటాల సునీతకేనా! చంద్రబాబు మంత్రుల పనితీరు పై జరిపిన సర్వే లో పరిటాల సునీత కు ఆశించినంత మంచి మార్కులు రాలేదని ఒక కామెంట్.

చంద్రబాబు అవసరం కోసం పరిటాల సునీత బలి కావల్సిందేనా అని ఊహాగానాలు సాగుతున్నాయి. అయినా ఒకరికి మోదం చేకూర్చడానికి, మరొకరికి అనివార్యంగా ఖేదం కలిగించక తప్పని పరిస్థితి ఇది. నిజానికి సామాజిక వర్గ సమీకరణాల పరంగా అయితే పయ్యావుల కేశవ్ కంటె పరిటాల రవి కుటుంబానికే అభిమానులు ఎక్కువ. అయితే కేశవ్ పార్టీ అవసరాల కోసం మంత్రిగా ఉండాల్సిందేనని.. ఆ మేరకు తప్పనిసరిగా కొన్ని త్యాగాలు అవసరమౌతాయని.. పరిటాల సునీతకు చంద్రబాబు నచ్చచెప్పవచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు.