తెలంగాణలో గేమ్ మార్చిన చంద్రబాబు

Tue Nov 06 2018 14:17:28 GMT+0530 (IST)

సర్వ స్వతంత్రాన్ని అనుభవించే తెలంగాణ కాంగ్రెస్ లో స్వేచ్ఛ మాయం అయినట్టేనా? ఇంతకాలం ఎవరికి వారు సీఎం అభ్యర్థులుగా ఫీలయిన తెలంగాణ కాంగ్రెస్ లో చంద్రబాబు ముద్ర పడిందా? రెడ్ల అడ్డాగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ రెడ్లకు శఠగోపం పెట్టనుందా? అవును.. అయితే ఆ మహిమంతా చంద్రబాబుదేనట. ఎపుడైతే తెలుగుదేశం పార్టీతో తెలంగాణ కాంగ్రెస్‌కు పొత్తు కుదిరిందో ఆ రోజే పార్టీ జుట్టు చంద్రబాబు చేతుల్లోకి పోయిందంటున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ సీఎం ఉత్తమ్ రెడ్డో - జానా రెడ్డో - రేవంత్ రెడ్డో కాదు... ఏమిటీ సంచలనం అనుకుంటున్నారా? అవును. పార్టీ తెలంగాణలో గెలవాలంటే డబ్బు కావాలి. అధికార పార్టీని ఢీకొనేంత డబ్బు ఖర్చు పెట్టే మగాడు తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరూ లేరు. అందుకే ఆ శక్తి నేనిస్తాను... నేను చెప్పింది చేయండి అని చంద్రబాబు షరతుకు రాహుల్ గాంధీ తలొగ్గినట్లు చెబుతున్నారు. జాతీయ కాంగ్రెస్ బాబు మాట వినడం ఏంటని అనుకోవచ్చు. పరిస్థితులు అలాంటివి. దక్షిణాదిలో కుమారస్వామితో మంచి దోస్తీ చేసిన బాబు అటు కూడా రాజకీయం నడపడానికి సిద్ధంగా ఉన్నాడు. దాంతో పాటు ఇండియాలో ఇపుడు కేవలం మూడే మూడు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వద్ద డబ్బుల్లేవు. కనుక ఈసారి కనుక డబ్బు ఖర్చు పెట్టకపోతే అధికారంలోకి రావడం కల్ల. అది జరిగితే నష్టం తెలంగాణకే పరిమితం కాదు - జాతీయ కాంగ్రెస్ మీద కూడా పడుతుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్ కూడా చంద్రబాబు ఆర్థిక బలానికి పడిపోయాడు. ఇంతకీ చంద్రబాబు చేసిన డిమాండ్ ఏంటో తెలుసా?

సీఎం పదవి తాను ఎంపిక చేసిన అభ్యర్థికి ఇవ్వాలట. అంతేకాదు - ఆ అభ్యర్థి బీసీ అభ్యర్థే అట. ఇదేం పెద్ద షరతు అని సింపుల్ గా తీసిపడేస్తారేమో. దీని వెనుక చాలా కథ ఉంది. తెలంగాణలో రెడ్లు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. చంద్రబాబు నిర్ణయం వల్ల రెడ్లకు-కాంగ్రెస్ కు ఇగో సమస్య వచ్చే ప్రమాదం ఉంది. అయితే అది కాంగ్రెస్ కు నష్టం గాని తెలుగుదేశానికి కాదు. ఎలాగంటే... రెడ్లు టీడీపీ బలం కాదు. బీసీలు టీడీపీ బలం. 2014 తర్వాత బీసీలు మెల్లమెల్లగా కేసీఆర్ కు దూరమయ్యారు. వారికి కేసీఆర్ రకరకాల పథకాలు ప్రకటించి మచ్చిక చేసుకున్నారు. కొత్త వర్గాన్ని ఆకట్టుకోవడం కంటే తెలుగుదేశంతో బాగా కనెక్టయి ఉన్న బీసీలను దగ్గర చేయడం సులువని గ్రహించిన బాబు బీసీలకు అధికార ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటారు. ఎన్నికల అనంతరం మహాకూటమి గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి ఎంపికపై వ్యూహాత్మక పబ్లిసిటీ చేస్తారు. దీనివల్ల బీసీల్లో తెలుగుదేశానికి సాఫ్ట్ కార్నర్ పెంచడం ద్వారా ఓటు బ్యాంకును తిరిగి తెచ్చకునే ప్రయత్నమిది. అయితే మహాకూటమి గెలుస్తుందో లేదో తెలియదు కాబట్టి ఇప్పటి నుంచి ఆ దిశగా పావులు కదుపుతున్న బాబు తనదైన వ్యూహాన్ని మొదలుపెట్టారు. అందుకే ఉత్తమ్ టీం ఇచ్చిన అభ్యర్థుల లిస్టులో కొందరు పేర్లను చంద్రబాబు మార్చారట. అంటే మహాకూటమి గెలిచినా గెలవకపోయినా తన పార్టీ మాత్రం గెయిన్ అయ్యేలా చంద్రబాబు పక్కా స్ట్రాటజీతో వెళ్తున్నాడు. అయితే ఒకవేళ మహాకూటమి కనుక ఓడిపోతే రెడ్ల వర్గం కాంగ్రెస్ కు కొంచెం దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఆంధ్రల్లో రెడ్లందరినీ వైసీపీ అధినేత జగన్ కు వదిలేసుకుని అక్కడ కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. ఇక్కడ కూడా అదే జరిగితే ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టం. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ బాబు మాట వినకతప్పడం లేదు. మొత్తానికి కాంగ్రెస్ ను బాబు నోట్ల కట్టలతో కొడుతున్నాడు.