Begin typing your search above and press return to search.

పెద్దిరెడ్డి ...... 'దేశం' పై పోరురెడ్డి

By:  Tupaki Desk   |   15 Aug 2018 8:11 AM GMT
పెద్దిరెడ్డి ...... దేశం పై పోరురెడ్డి
X
చిత్తూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఆ మాటకొస్తే దేశ రాజకీయాలకే కీలకం. పుణ్యక్షేత్రాలకు నెలవైన చిత్తూరు జిల్లా రాజకీయాలు అధికారాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ జిల్లా వాసే. సమైక్య రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ జిల్లా వారే. దీంతో వచ్చే ఎన్నికలలో ఈ జిల్లా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చుట్టూనే జిల్లా రాజకీయాలే కాదు రాష్ట్ర రాజకీయాలు కూడా తిరుగుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పుతున్నారు. వారిని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యంగానే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మింగుడు పడడంలేదు. తన సొంత జిల్లాలో ఈ కుటుంబాన్ని నిలువరించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆయనకు అంతుపట్టడం లేదు.

గత ఎన్నికలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లాలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీనికి కారణం పెద్దిరెడ్డి కుటుంబమే అని జిల్లాలో ప్రచారంలో ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబం ఏది చెప్తే అదే జరుగుతుంది. దీనికి కారణం పెద్దిరెడ్డి పూర్వీకులే. దశాబ్దాలుగా ఆ కుటుంబం జిల్లాలో చేసిన కార్యక్రమాలే కావడం విశేషం. దీంతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినట్లేనని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. జిల్లాలో పట్టున్న గాలి ముద్దుక్రిష్ణమ నాయుడి మరణం మాజీ మంత్రి బొజ్జల క్రిష్ణారెడ్డి అసంత్రుప్తి తెలుగుదేశం పార్టీకి చేటు తేనున్నాయి. ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీని జిల్లాలో గెలిపించుకోవడం చంద్రబాబు నాయుడకు పెద్ద పరీక్షే. పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం కోసం తెలుగుదేశం పార్టీ అదే సామాజిక వర్గానికి చెందిన అమర్‌ నాధ్ రెడ్డిని ప్రయోగించాలని భావిస్తోంది. అయితే పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎదుర్కునే సత్తా అమర్‌ నాధ్ రెడ్డిలో లేదని జిల్లాలో రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి చిత్తూరు జిల్లా రాజకీయాలు పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూనే తిరుగుతున్నాయి.