తెలంగాణాలో తేలు మంత్రం ఏపీలో పని చేయలేదు

Mon Mar 25 2019 23:00:01 GMT+0530 (IST)

తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి పొత్తు పెట్టుకుని పోటీకి రావడాన్ని కేసీఆర్ గట్టిగా వ్యతిరేకించాడు. తెలంగాణా ద్రోహి కాంగ్రెస్ తో కలిసి వచ్చినందుకు టిడిపిపై విరుచుకుపడ్డాడు. ఒకప్పటి తెలంగాణా సెంటిమెంట్ ను రగిలించి - చంద్రబాబుకు ఓటేస్తే తిరిగి తెలంగాణా ఆంధ్రా పాలనలోకి వెళుతుందని హెచ్చరించాడు. టిటిడిపి సింగిల్ గా పోటీ చేసి ఉన్నా కేసీఆర్ ఇంతగా చంద్రబాబును విమర్శించేవాడు కాదేమో! కానీ పచ్చి వ్యతిరేక కాంగ్రెస్ తో పచ్చ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని అటు కేసీఆర్ మాత్రమే కాదు తెలంగానా ప్రజలూ సహించలేక పోయారు. ఇది మాయలమారి గుంపు అని మహాకూటమి అంటే మాయా కూటమి అని మూకుమ్మడిగా పొత్తు పార్టీలన్నిటినీ తరిమికొట్టారు.2018 తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు ఎంట్రీ కేసీఆర్ గెలుపును ఈజీ చేసింది. టి. ఎన్నికల బహిరంగ సభల్లో చంద్రబాబు కేసీఆర్ ని గంటలకొద్దీ విమర్శించాడు. కానీ కేసీఆర్ చంద్రబాబు ఆంధ్రా పాలకుడు అన్న ఒక్క మాటతోనే ప్రజా వ్యతిరేకతను ఒక్కతాటిపైకి తెచ్చాడు. చంద్రబాబు రగల్చాలనుకున్న సెటిలర్స్ ఫీలింగ్ ను కూడా కేసీఆర్ తునాతునకలు చేసేసాడు. మొత్తానికి తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు పేరునే తేలు మంత్రంగా వాడి కేసీఆర్ సగం యుద్ధం గెలిచేసాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇదే స్టేటజీని ఫాలో అవ్వాలని చంద్రబాబు తెగ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తెలంగాణాలో పనిచేసిన తేలు మంత్రం ఏపీ లో మాత్రం వికటిస్తోంది. బాబును కేసీఆర్ తిడితే తెలంగాణా ప్రజలు స్పందించారు కానీ చంద్రబాబు ఏపీలో కేసీఆర్ పై దుమ్మెత్తి పోస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నా ప్రత్యర్థి జగన్ కాదు కేసీఆర్ అంటూ చంద్రబాబు ఊగిపోతుంటే తెలుగు ప్రజలు ఇది ఉక్రోషం - ఉడుకుమోత్తనమే తప్ప మరోటి కాదని ముఖం తిప్పేసుకుంటున్నారు. తెలంగాణాలో కేసీఆర్ తిట్టినదానికి ప్రతీకారంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు తప్పితే ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ కి ఏమిటి సంబంధం అని బహిరంగంగానే బాబు తీరును తప్పుబడుతున్నారు. అసలెక్కడా టిఆర్ ఎస్ లేదా కేసీఆర్ ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోటీ చేస్తామనో - ప్రతిపక్షం కోసం ప్రచారం చేస్తామనో చెప్పలేదు. హోదాకు మద్దతు ఇస్తామని మాత్రమే చెప్పారు. దీనికే చంద్రబాబు అతలా కుతలం అవడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు.