Begin typing your search above and press return to search.

కేంద్రంపై కత్తులు దూయబోతున్న చంద్రబాబు!

By:  Tupaki Desk   |   23 Nov 2017 11:30 PM GMT
కేంద్రంపై కత్తులు దూయబోతున్న చంద్రబాబు!
X
ఒకరి అవసరం కోసం ఒకరు.. మొదలుపెట్టిన స్నేహానికి అప్పుడే ఎండ్ కార్డు పడిపోతోంది. తొలినుంచి ఒకరిపట్ల ఒకరు అనుమానంతో సాగించిన స్నేహమే.. ఎదుటివాళ్లను ఎలా వాడేసుకుందామా అని చేసిన ప్రయత్నాలే.. అన్నీ ఇప్పుడు ముగిసిపున్నాయి. తెలుగుదేశానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి.. బంధం తెగిపోనుంది. ఈ విషయమై ఇప్పటికే చంద్రబాబునాయుడుకు హస్తినాపురం నుంచి సంకేతాలు అందాయని... ఆయన కూడా మానసికంగా.. భాజపాతో బంధం లేకుండా ఎన్నికల సమరాన్ని ఎలా ఎదుర్కోవాలా అనే వ్యూహాలకు ఇప్పుడు సిద్ధం అవుతున్నాడని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబునాయుడు ఇప్పుడు స్కెచ్ మార్చారు. కేంద్రం మీద దూయడానికి నెమ్మదిగా కత్తులకు పదును పెడుతున్నారు. రాష్ట్రానికి సాయం అందించడంలో కేంద్రం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదనే వాదనను నెమ్మదిగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి చంద్రబాబునాయుడు ఆల్రెడీ స్కెచ్ ప్రారంభించారు. ఈ వాదనను నెమ్మదిగా ప్రజల్లోకి చొప్పించిన తర్వాత.. ఒకేసారి.. మాటల దాడి చేసినా సరే.. ప్రజలు తనను నమ్ముతారని ఆయన భావిస్తున్నారు. ఇన్నాళ్లూ వారితో అనుబంధం అంటకాగిన తరువాత... వారిని నెత్తిన పెట్టుకుని.. వారు చెప్పిన ప్యాకేజీలు గొప్పవనే ఉద్దేశంతోనే తాను ఓకే చెప్పినట్టు జనాన్ని నమ్మించిన తర్వాత.. ఒకేసారి వారికి వ్యతిరేకంగా మాట్లాడితే తన క్రెడిబిలిటీ దెబ్బతింటుందని.. నెమ్మదిగా ప్రజలను ట్యూన్ చేసి.. భాజపాపై దాడి పెంచాలని ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా పలువురు చెబుతున్నారు.

పోలవరం గురించి శాసనసభలో ఆయన ప్రసంగం కూడా ఇందుకు పెద్ద ఉదాహరణ. కేంద్రం నుంచి నిధులు సకాలంలో వస్తే.. రెండేళ్లలో పూర్తిచేస్తాం.. అని చంద్రబాబు అనడం కీలకమైన కామెంటే. పైగా చేసిన ఖర్చులోనే.. ఇంకా మూడువేల కోట్లు ఇవ్వలేదని ఇంత స్పష్టంగా ఆయన గతంలో చెప్పలేదు. అలాగే.. పనుల నిర్వహణ గురించి తామెన్నడూ కేంద్రాన్ని కోరలేదని, వారు అడిగితేనే.. పనుల నిర్వహణ చేపట్టామని కూడా చంద్రబాబు తొలిసారిగా పెదవివిప్పారు. ఇవన్నీ.. బంధం తుది ఘట్టంలో ఉన్నదనడానికి సంకేతాలే. కొందరు నేతలు మాత్రం.. చంద్రబాబునాయుడుకు బాకా ఊదుతుందనే పేరున్న ఒక దినపత్రిక లో వస్తున్న వరుస కథనాలను కూడా ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు అనుమతి లేకుండా ఆ పత్రికలో కథనాలే రావని.. దాని సంకేతం.. కేంద్రం గురించి ప్రజల్లోకి ఒక నెగటివ్ అభిప్రాయాన్ని వ్యాపింపజేయడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని.. వారు పేర్కొంటున్నారు. మొత్తానికి చంద్రబాబు-మోడీ బంధం పుటుక్కుమనేలా ఉంది. ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో విడివిడిగా పోటీచేస్తే ఎవరికి లాభమో.. ఎవరికి నష్టమో.. ఇప్పుడే ఊహించడం కాస్త తొందరపాటు అవుతుంది గానీ.. వీరు మాత్రం కలిసి నడవబోరని చాలా పరిణామాలు కనిపిస్తున్నాయి.