ఆనం ఎందుకు హర్ట్ అయ్యారో బాబుకు తెలీదట!

Thu Jun 21 2018 12:07:05 GMT+0530 (IST)

చేతిలో అధికారం.. చుట్టూ మందీ మార్బలం ఉన్నప్పుడు లోపాలు అస్సలు కనిపించవు. అంత సందడిలోనూ లోపాల్ని గుర్తించే వారే అసలుసిసలు నాయకుడిగా అందరి మనసుల్ని దోచుకుంటాడు. అదేం సిత్రమో కానీ.. విపక్షంలో ఉన్న వేళ.. తాను చేసిన తప్పుల గురించి అదే పనిగా చెప్పుకొనే చంద్రబాబుకు పవర్ చేతికి వస్తే మాత్రం అవేమీ కనిపించవు. దేశంలోనే తోపు నేతల్లో తానే మొదటోడ్ని అంటూ గొప్పలు చెప్పుకునే ఆయన.. గతంలో తాను చేసిన తప్పుల్ని మళ్లీ మళ్లీ చేయటం కనిపిస్తుంటుంది.విభజన నేపథ్యంలో ఏపీకి దెబ్బేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతల్ని తన పార్టీలోకి తీసుకున్న చంద్రబాబు.. వారందరిని సమన్వయం చేసుకోవటంలోనూ.. పార్టీలో మమేకం అయ్యేలా చేయటంలో దారుణంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. బయట నుంచి వచ్చిన వారికి బాబు ఇచ్చిన హామీలేమీ వాస్తవ రూపం దాల్చకపోవటం.. నమ్మించి మోసం చేయటంలో మొనగాడన్న పేరుకు తగ్గట్లే బాబు తీరు ఉంటుందన్న అనుభవం సదరు నేతల్లో అంతకంతకూ పెరుగుతోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోని బాబుకు దూరమయ్యేందుకు ఎవరికి వారు సిద్ధమవుతున్నారు.

ఇలాంటి కారణాలతోనే నెల్లూరు జిల్లా నేత ఆనం రామనారాయణ రెడ్డి కూడా వెళ్లిపోవటం తెలిసిందే. తాజాగా ఆనం ఎందుకు వెళ్లిపోవటానికి కారణం ఏమిటో తనకు అర్థం కావటం లేదన్న వ్యాఖ్యను చేశారు చంద్రబాబు. తాను ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చానని.. ఆయనకు గౌరవం ఇవ్వనిది ఎప్పుడంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.

గౌరవం ఇచ్చారా?  ఇవ్వలేదా?  అన్నది ఎదుటి మనిషికి తెలుస్తుందే తప్పించి.. బాబు లాంటి వారికి తెలుస్తుందా?

నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు బాబును కలిసిన సందర్భంగా ఆనం ప్రస్తావన వారి మధ్య వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ  సందర్భంగా బాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

పార్టీని వీడాలనుకున్న ఆనం చేసిన వ్యాఖ్యల్ని తాను పత్రికల్లో చూశానని.. ఆయన ఎందుకలా అనుకుంటున్నారు?  నేను ఆయనకు గౌరవం ఇవ్వలేదో నాకు అర్థం కావటం లేదు.. సీనియారిటీని గౌరవించి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చాం కదా? అంటూ బాబు చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు తానేం తప్పు చేయలేదన్న ధోరణిలో ఉన్న విషయం అర్థమవుతుంది. ఓ పక్క అధినేత కారణంగా హర్ట్ అయ్యానన్న విషయాన్ని చెప్పిన వెంటనే.. ఎందుకలా? అన్న విషయంపై క్లారిటీ తీసుకుంటే బాగుంటుంది కానీ.. అదేమీ లేకుండా ఇలా ఆశ్చర్యపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఆనంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అనుకున్నామని.. అదే సమయంలో ఆనం వివేకానందరెడ్డి కూడా తనను కలిసి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారని.. ఇద్దరూ పదవి అడగటంతో ఏం చేయాలో పాలుపోక.. ఇవ్వలేనట్లుగా బాబు చెప్పిన మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇద్దరు సోదరులు పదవులు కోరినప్పుడు.. వారిద్దరిని కూర్చోబెట్టి ఒక పదవి ఇవ్వగలనని.. మీరే తేల్చుకోండని చెబితే సరిపోయే దానికి.. ఇద్దరికి పదవులు ఇవ్వకుండా ఉండటం ఎలాంటి రాజకీయం? అంటూ ప్రశ్నిస్తున్నారు. సమస్యకు సొల్యూషన్ చూడాలే కానీ.. సమస్యను అలా మురగబెడితే మొదటికే మోసం వస్తుందన్న ప్రాధమిక విషయాన్ని బాబు లాంటి సీనియర్ కు ఇంకా అర్థం కాకపోవటం ఏమిటో?