Begin typing your search above and press return to search.

బాబు విస్త‌ర‌ణ వాయిదా ప‌డిన‌ట్లే

By:  Tupaki Desk   |   26 Feb 2017 8:38 AM GMT
బాబు విస్త‌ర‌ణ వాయిదా ప‌డిన‌ట్లే
X
ఒక‌డుగు ముందుకు...మూడు అడుగులు వెన‌క్కు అన్న‌ట్లుగా సాగుతున్న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై కొత్త చ‌ర్చ మొద‌లైంది. త్వ‌ర‌లోనే విస్త‌ర‌ణ ఉంటుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ వాయిదా వేసుకున్న‌ట్లు చెప్తున్నారు. కీల‌క‌మైన శాస‌న‌మండ‌లి ఎన్నిక‌లు ఉండ‌ట‌మే కార‌ణం. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు విస్తరణ చేపడితే కేబినెట్‌లో చోటు దక్కని ఎమ్మెల్యేలు, ఆయా సామాజిక వర్గాలకు చెందిన పట్టభద్ర ఓటర్ల నుండి వ్యతిరేకత వస్తుందనే ఉగాదికి వాయిదా వేసినట్లు చెప్తున్నారు. అయితే విస్త‌ర‌ణ ఎప్పుడు చేసినా మంత్రి వర్గ విస్తరణలో ఉత్తరాంధ్రకు చెందిన సామాజిక తరగతులకు న్యాయం జరుగుతుందా? లేదా? అన్న చర్చ ఆ ప్రాంతంలో జోరుగా జ‌రుగుతోంది.

ఉత్త‌రాంధ్ర వాసులు వినిపిస్తున్న అభిప్రాయాల ప్ర‌కారం ఈ ప్రాంతానికి నాలుగు లేదా ఐదు మంత్రి పదవులు ఇవ్వడం పరిపాటి. కేంద్ర కేబినెట్‌లో కూడా ప్రాతినిధ్యం లభిస్తోంది. సామాజిక తరగతుల బలాన్ని బట్టి ఆయా వర్గాల నేతలకు కేంద్ర, రాష్ట్ర కేబినెట్‌లో స్థానం కల్పించడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ప్రధానంగా కాళింగ, తూర్పు కాపు, కొప్పుల వెలమ, క్షత్రియ, గవర, గిరిజన సామాజిక తరగతులకు చెందిన వారికి కేబినెట్‌లో చోటు దక్కేది. 1995 నుండి 2004 మధ్య కాలంలో పరిపాలించిన చంద్రబాబు ఇదే పార్ములాను అనుసరించారు. తర్వాత వచ్చిన రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయా వర్గాలకు చోటు కల్పించారు. 2014 లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉత్తరాంధ్రలో సామాజిక కూర్పును పాటించలేదు. అగ్ర‌వ‌ర్ణాలుగా ఉన్న తూర్పు కాపు నుంచి కిమిడి మృణాళిని, వెలమ సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడు, అచ్చెంన్నాయుడు, కాపు నుండి గంటా శ్రీనివాసరావుకు అవకాశం కల్పించారు. కేంద్ర కేబినెట్‌లో క్షత్రియులైన పి.అశోక్‌గజపతిరాజుకు అవకాశం కల్పించారు. బీసీ ఎస్టీలను పక్కనబెట్టారు. శ్రీకాకుళం రాజకీయాల్లో కీలకంగా ఉన్న కళింగ, విశాఖ నుంచి గవర, గిరిజనులు, ఇతర బలహీన వర్గాల్లో ఒక్కరినీ కేబినెట్‌లోకి తీసుకోలేదు.

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో ప్రస్తుత మంత్రుల్లో పల్లె రఘునాథరెడ్డి, పీతల సుజాత, కిమిడి మృణాళిని, పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబులను తొలగిస్తారన్న ప్రచారం జ‌రుగుతుంద‌ని చెప్తున్నారు. కొత్తగా నారా లోకేష్‌, కిమిడి కళా వెంకటరావు, భూమా అఖిల ప్రియ, అమర్నాథరెడ్డి, సుజయ‌కృష్ణ రంగారావు, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మహ్మద్‌ జానీ, గొల్లపల్లి సూర్యారావు తదితరులను చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి మృణాళిని తొలగించి ఆమె బావ కళా వెంకటరావును కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఆయనది శ్రీకాకుళం జిల్లా. అచ్చెన్నాయుడుతో కలిపి ఆ జిల్లాలో ఇద్దరైతే ఇక కళింగ సామాజిక వర్గ ఆశలు గల్లంతైనట్లే. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చిన విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌ కృష్ణ రంగారావును తీసుకుంటారన్న చర్చ నడుస్తోంది. విశాఖ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా, అయ్యన్నలను యథాతదంగా కొనసాగించే అవకాశాలున్నాయి. దీంతో గవర, కాళింగ, గిరిజన సామాజిక వర్గాల నుండి మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి మరోసారి భంగపాటు తప్పకపోవచ్చు.

బొబ్బిలి ఎమ్మెల్యేను క్షత్రియ కోటాలో వేస్తే అ జిల్లా నుండి కేంద్ర కేబినెట్‌లో అశోక్‌గజపతిరాజుతో కలిపి రెండు కీలక పదవులు ఒకే కులానికి కేటాయించారన్న అపవాదును మూటకట్టుకోవాల్సిందే. అప్పుడు మిగిలిన రెండు జిల్లాల్లో ఉన్న నలుగురిలో కాపు - వెలమల నుండే ఇద్దరేసి చొప్పున కేబినెట్‌ లో కొనసాగే అవకాశాలున్నాయి. ఒక వేళ బొబ్బిలి ఎమ్మెల్యేను క్షత్రియునిగా కాకుండా వెలమ సామాజిక వర్గం కోటాలో వేసినా మూడు జిల్లాల్లోనూ అదే వర్గానికి చెందిన వారికే మంత్రి పదవులిచ్చారన్న అపవాదు చంద్రబాబుకు తప్పదు. కాళింగ - గవర - ఎస్టీ - ఎస్సీలకు ఉగాదికి చేపట్టే మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. మొత్తంగా మంత్రి వర్గ విస్తరణ చేపడితే తమకు అవకాశాలు వస్తాయని ఆయా వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/