నిన్న పార్టీకి పండగ.. ఇవాళ ఎంపీలకు పండగ!

Mon Apr 09 2018 14:05:04 GMT+0530 (IST)

ఆదివారం నాడు ఢిల్లీలో నడిపించిన హైడ్రామా.. మీడియాలో వచ్చిన మైలేజీ.. తమ పార్టీ ఎంపీలను.. రోడ్ల మీద ఈడ్చి మరీ.. పోలీసులు బస్సు ఎక్కించడం.. ఇలాంటి దృశ్యాలు చూసి.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు పండగ చేసుకున్నారు. ఈ మాత్రం టీవీ దృశ్యాలు చాలు.. వైకాపా వారి దీక్షలకంటె మన వీధిపోరాటాల గురించే ఎక్కువ టముకు కొట్టుకోవచ్చు.. అని వారు సంబరపడిపోయారు.కేవలం 24 గంటలు కూడా గడవకముందే.. ఢిల్లీ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా... ఇన్నాళ్లు చేసిన దీక్షలకు వీసమెత్తు జవాబు రాకపోయినా.. వచ్చిన మైలేజీ చాలనుకున్న చంద్రబాబునాయుడు ఎంపీలకు రిలీఫ్ ప్రకటించారు. ఢిల్లీలో బిచాణా ఎత్తేసి ఇక విశ్రాంతి తీసుకోవచ్చునని వారికి పురమాయించారు.

దీంతో.. పార్లమెంటు ముగిసిపోయినా కూడా తమ తమ వ్యాపారాలు  చూసుకోకుండా.. ఇంకా ఎన్నాళ్లు ఢిల్లీలో పార్లమెంటు గాంధీబొమ్మ వద్ద  ప్లకార్డులు పట్టుకుని డ్రామాలు నడిపించాలా అని చిరాకు పడిపోతున్న తెలుగుదేశం ఎంపీలు.. ఊపిరి పీల్చుకుని.. పండగ చేసుకుంటూ రాష్ట్రానికి వచ్చేయబోతున్నట్లు సమాచారం. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల నిరాహార దీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాలుగోరోజుకు చేరిన దీక్షల్లో ఇద్దరే ఎంపీలు మిగిలారు. వార్ధక్యం సీనియారిటీ ప్రకారమే మేకపాటి - వరప్రసాద్ - వైవీ ఆస్పత్రికి చేరుకున్నారు. మిధున్ రెడ్డి - అవినాష్ రెడ్డి మడమ తిప్పని పోరాటం సాగిస్తున్నారు.

ఒకవైపు ఆ పార్టీ ఇలాంటి సీరియస్ పోరాటాన్ని కంటిన్యూ చేస్తుండగా.. తెలుగుదేశం  ఎంపీలు తగుదునమ్మా అంటూ ఢిల్లీ వదలి వచ్చేస్తే ప్రజలు ఛీ కొట్టరా..? అంటూ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఎంపీలు రాజీనామా చేస్తే ఇక ఢిల్లీలో ఉండి పోరాడేది ఎవరు? అంటూ చంద్రబాబు పలుమార్లు ప్రశ్నించారు. వైకాపాను ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఉండిపోరాడడం అంటే.. ఇలా అక్కడినుంచి పారిపోయి రాష్ట్రానికి వచ్చి బస్సుయాత్రలు చేయడమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.