Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్లకే బాబు లాంటోళ్లు దొరుకుతారా?

By:  Tupaki Desk   |   18 Feb 2017 7:00 AM GMT
ఆంధ్రోళ్లకే బాబు లాంటోళ్లు దొరుకుతారా?
X
విభజనతో ఏపీకి ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగింది. ఈ మాట ఏపీ అధినేత మొదలు.. తెలంగాణ రాష్ట్ర పాలకులు కూడా ఒప్పుకునే మాట. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె.. ఎంపీ కవిత డిమాండ్ చేస్తారు కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి మాత్రం రాదు. నిజానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తారు. తన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినే నిర్ణయాలకు ససేమిరా అంటారు. అవసరమైతే పోరాటానికి దిగేందుకైనా సిద్ధమవుతారే కానీ.. వెనక్కి తగ్గరు.

కానీ.. ఏపీ సీఎం చంద్రబాబు తీరు మాత్రం అందుకు భిన్నం. ఏపీకి ప్రయోజనం కలిగే అవకాశం వంద శాతం ఉన్న ప్రత్యేక హోదా మీద ఆయన ఇప్పటికే వెనక్కి తగ్గటమే కాదు.. హోదా పేరు ఎత్తిన వారిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హోదా ఆకాంక్ష ప్రజల్లో ఉన్నా.. దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హోదాను వదిలేసి.. ప్రత్యేక ప్యాకేజీ అంశం పైనా ఆయన పోరాడుతున్నారా? అంటే అదీ లేదనే చెప్పాలి.

పేరుకు ప్రత్యేక ప్యాకేజీ పేరిట హడావుడి.. హడావుడిగా నిర్ణయాన్ని ప్రకటించేసి.. సన్మానాలు చేసేసుకున్నారే కానీ..కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత గురించి ఇప్పటివరకూ ఎలాంటి ప్రయత్నం జరగలేదని చెప్పాలి. కేంద్రానికి.. ఏపీ సర్కారుకు మధ్య ఓకే అనుకున్నప్యాకేజీకి చట్టబద్ధత ఎందుకు ఆలస్యమవుతుందన్న విషయంపై ఏపీ ముఖ్యమంత్రి ఇప్పటివరకూ స్పష్టత ఇచ్చింది లేదు.

అటు కేంద్రంలోనూ.. ఇటు ఏపీ రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసి మరో రెండు నెలలకు మూడేళ్లు పూర్తి కానున్నాయి. విభజనలో భాగంగా ఇస్తామన్న హామీల్ని ఇంతవరకు నెరవేర్చింది లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. రైల్వే జోన్ మొదలు.. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఏం చేయనుందన్న విషయంపై స్పష్టత లేదు. నిత్యం తెగ హడావుడి చేసే చంద్రబాబు.. ఏపీకి దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగించే అంశాల మీద ఎందుకు దృష్టి పెట్టటం లేదన్నది పెద్ద ప్రశ్న.

మరికాస్త అర్థం కావాలంటే.. ఎవరైనా బాగా అప్పులున్న అతడు.. మరిన్ని అప్పులు చేస్తూ.. విందులు.. వినోదాలు.. సేవా కార్యక్రమాలు.. సదస్సులు నిర్వహిస్తున్నారనుకోండి ఎలా ఉంటుంది? ఎన్నిఅప్పులున్నోళ్లు అయినా.. ఇంట్లో ఫంక్షన్ చేస్తే వచ్చే వాళ్లంతా వస్తారు. పెట్టింది తిని వెళతారు. మీకేమండి.. బ్రహ్మాండంగా చేస్తారని పొగిడి వెళతారు. కార్యక్రమాన్ని నిర్వహించటంతోనే సమర్థవంతులనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆ సమర్థత వెనుక ఆర్థిక దన్ను అత్యవసరం. ఏపీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే.. పుట్టెడు అప్పులున్న పెద్ద మనిషి తరచూ ఏదో ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసేయటం.. ఈవెంట్లను భారీగా నిర్వహించటం ద్వారా.. అదే ప్రభుత్వ సమర్థతకు కొలమానంగా చెప్పుకునే తీరు చూస్తే.. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా.. లేక.. ఏపీ ప్రభుత్వం నిర్వహించే ఈవెంట్లకు మేనేజరా? అన్న డౌట్ రాక మానదు.

ఈవెంట్లు చేయొద్దని చెప్పటం లేదు. అలాంటి వాటి వల్ల బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందనటంలో సందేహం లేదు. కానీ.. ఈవెంట్లు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వాలు పని చేయకూడదు కదా. ఓపక్క కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించిజరుగుతున్న ప్రయత్నాలేమిటో అర్థం కాదు. మరోవైపు.. ఏపీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ తగ్గుతుందే తప్పించి పెరగటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ.. ప్రోగ్రాంలు చేసుకునే కన్నా పాలన మీద మరింత ఫోకస్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

న్యాయబద్ధంగా.. ధర్మబద్ధంగా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి ప్రయత్నాల్ని ముమ్మరం చేయటంతో పాటు.. పాలనను మరింత సమర్థంగా నిర్వహించటం.. ఏపీ ఆదాయాన్నిపెంచేలా ప్రయత్నాల్ని మరింత పెంచటం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రచారంతోనే అన్నీ జరిగిపోతాయంటే.. దేశం వెలిగిపోతుందంటూ అప్పుడెప్పుడో వాజ్ పేయ్ కాలంలో చెప్పినట్లుగా చెబితే.. నాడు ప్రజలు ఛీదరించుకున్నట్లే బాబును మరోసారి తిరస్కరించటం ఖాయం. దేశం నిజంగా వెలిగిపోతే.. పదమూడేళ్ల తర్వాత కూడా ఇన్ని సమస్యలతో ఎందుకు ఉన్నట్లు? అందుకే.. ప్రచారం మీద ఫోకస్ తగ్గించి.. పాలన మీద పట్టు పెంచుకోకపోతే ఏపీకే కాదు.. బాబుకు కూడా కష్టం. ఇప్పుడున్న పరిస్థితే మున్ముందు కొనసాగితే.. బాబును వదిలించుకుంటే తప్పించి.. ఏపీ బాగుపడని పరిస్థితి తలెత్తటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/