అందరికీ నీతులు చెప్పే బాబు...

Sun Jul 15 2018 21:20:11 GMT+0530 (IST)

తెలుగు దేశం పార్టీ... హైటెక్ సర్వీసెస్ ను చాలా ముందుగా ఒంట బట్టించుకున్న పార్టీ. హైటెక్ బాబుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు వెనుక ఉన్నది ఎవరు? తాజ్ మహల్ కు రాళ్లెత్తిన కూలీలు ఎవరు? అన్నట్లే ... బాబును హైటెక్ బాబు చేసిన టీం ఏది ? కచ్చితంగా ఏదో ఒక టీం పనిచేయాలి. చేస్తోంది కూడా. టీడీపీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ను నడిపిస్తున్న బాబు పార్టీ పర్సనల్ హైటెక్ బృందం తీవ్రంగా అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.ఎన్నికల సమయంతో పాటు సాధారణ సమయంలో కూడా టీడీపీకి ఒక ఇంటర్నెట్ అండ్ టెక్ టీం ఉంది. అయితే ఎన్నికలు జరుగుతున్నపుడల్లా నెలలపాటు రాత్రీపగలు తేడా లేకుండా పనిచేస్తున్న ఈ బృందంలో చాలా మంది జీతాలు గొర్రె తోక బెత్తెడు అన్నట్లు ఉన్నాయట. ఇంత పని చేసి పార్టీని అధికారంలోకి తెచ్చాక కూడా మా జీవితాల్లో ఏ మార్పూ లేదని - మా కంటే కార్యకర్తలుగా చెప్పుకుని తిరిగే వారే ఎక్కువ లాభపడుతున్నారని వాపోతున్నారట.

బాబుకు విదల్చడానికి చేతులు రావు. కనీసం లోకేష్ వచ్చాక అయినా తమ జీవితాలు మారుతాయని అనుకుంటే మా సేవలను దగ్గరనుంచి చూసిన ఆయన కూడా మమ్మల్ని పెద్దగా పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారట ఆ ఉద్యోగులు. గత ఎన్నికల్లో లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ టీం ప్రచార బాధ్యతలను చేపట్టింది. కాంట్రాక్ట్ మీద పని చేసిన వారి పరిస్థితి మరో ఘోరం అంటున్నారు. గత ఎన్నికల్లో తమను వాడుకుని తర్వాత ఏ విధంగా ఆదుకోని లోకేష్ ఇపుడు మళ్లీ గొడ్డు చాకిరి కోసం వారికి రమ్మని కబురు పంపారట. అయితే చాలా మంది లోకేష్ ప్రపోజల్స్ ను తిరస్కరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తమ ఆఫీసు ఉద్యోగులను సంతృప్తి పరచలేని బాబు-లోకేష్ లు ఇక రాష్ట్ర ప్రజలకు మాత్రం సంతృప్తికరమైన పాలన ఎలా అందించగలరో మరి!