అంత పెద్ద మాట తర్వాతా వేటు వేయరా బాబు?

Sun Jan 21 2018 10:12:21 GMT+0530 (IST)

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తాజాగా చోటు చేసుకున్న పరిణామం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణ అధికారపక్షంలోకి తెలుగుదేశం పార్టీని విలీనం చేయాలంటూ తీవ్ర వ్యాఖ్య చేసిన తర్వాత కూడా.. ఆయనపై చర్యలు తీసుకునేందుకు టీటీడీపీ వెనుకాడటం కనిపిస్తుంది.టీఆర్ ఎస్ లోకి టీడీపీని విలీనం చేయాలన్న వ్యాఖ్యలపై పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు తెలుగు దేశం పార్టీలో తీవ్ర కలకలాన్ని రేపాయి. తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా.. ఎలాంటి పార్టీకి ఎలాంటి పరిస్థితి దాపురించిందన్న మాటలు వినిపించాయి. 2019 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ అధికారాన్ని చేపడుతుందని.. ఆ తర్వాత మాత్రమే హైదరాబాద్ ను విడిచి వెళ్లే విషయం మీద ఆలోచిస్తామన్న చంద్రబాబు మాటలకు భిన్నంగా..  ఆ తర్వాత పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

అధికారం తర్వాత.. కనీసం తెలంగాణలో పార్టీ అయినా ఉంటుందా? అన్న అనుమానాలు వస్తున్న పరిస్థితి. పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరుగా వెళ్లిపోవటం.. ఇప్పటికే పార్టీ శాసనసభాపక్ష నేతలుగా ఉన్న ఇద్దరు నేతలు సైతం పార్టీ మారిపోయిన వైనం చూస్తేనే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుస్తుంది.

దీనికి తగ్గట్లే.. తాజాగా మోత్కుపల్లి నర్సింహులు ఒక అడుగు ముందుకేసి.. అరకొరగా ఉన్న పార్టీని తెలంగాణలో నడపటం అనవసరం అనుకున్నట్లున్నారేమో కానీ.. పార్టీని అధికారపక్షంలో విలీనం చేస్తే బాగుంటుందన్న భావనను వ్యక్తం చేశారు.

ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి చేసే నష్టం అంతా ఇంతా కాదు. ఆ విషయం తెలిసినప్పటికీ.. తెలుగు తమ్ముళ్లు ఆచితూచి అడుగులు వేస్తున్న వైనం చూస్తే.. నోరు జారిన నేతల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలన్నట్లుగా టీటీడీపీ అగ్రనాయకత్వం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఉన్న గుప్పెడు మంది నేతలపై ఏదో ఒక కారణం మీద చర్యలు తీసుకుంటే.. పార్టీలో నేతలే ఉండని పరిస్థితి నెలకొనటం ఖాయం. ఈ కారణంతోనే మోత్కుపల్లి  మీద చర్యల విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.  

మామూలుగా అయితే.. ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. కానీ.. అలాంటిదేమీ చేయకుండా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కూడా.. చర్యల్ని మాటను పక్కన పెట్టి వివరణ తీసుకోవాలని నిర్ణయం తీసుకోవటం చూస్తే.. తెలంగాణలో పార్టీకి ఉన్న దుస్థితి ఎంతన్నది తెలుగు తమ్ముళ్లు తమ నిర్ణయంతో చెప్పకనే చెప్పారని చెప్పాలి.

మోత్కుపల్లిని వివరణ కోరి.. అనంతరం పార్టీ కేంద్ర కమిటీకి నివేదిక ఇవ్వాలనుకుంటున్నట్లు పాలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాటలు చూస్తే.. బాబు హయాంలో పార్టీ ఎంత దారుణ పరిస్థితిలో ఉందన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.