Begin typing your search above and press return to search.

దీని అర్థం బీజేపీతో పొత్తు డౌటేనా బాబు?

By:  Tupaki Desk   |   20 Jan 2018 5:35 PM GMT
దీని అర్థం బీజేపీతో పొత్తు డౌటేనా బాబు?
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌లి కాలంలో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీతో సంబంధాలు ఒకింత దెబ్బ‌తింటున్నాయ‌నే కామెంట్ల నేప‌థ్యంలో ఆచితూచి స్పందించారు. రాబోయే ఎన్నిక‌ల్లో పొత్తుల గురించి ఇప్పుడే కాద‌ని...ఎన్నికలకు సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని వివ‌రించారు. త‌ద్వారా బీజేపీతో కొన‌సాగే విష‌యంలో ఉత్కంఠ‌ను క‌లిగించారు.

కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్ర‌బాబు పోలవరం కాంక్రీట్ పనులు, మట్టి పనులకు సంబంధించి 31 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను నవయుగ కంపెనీకి అప్పగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివ‌రించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పనులు ఆగిపోకుండా జాగ్రత్త పడ్డామన్నారు. ఇటీవల కూడా పోలవరంపై ప్రధాని నరేంద్ర మోడీకి తప్పుడు సమాచారం ఇచ్చారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటుతో ముందుకు పోతున్నామన్నారు. హైదరాబాద్‌ లో అభివృద్ధి చేసింది తానేనని హైదరాబాద్‌ లో అభివృద్ధి 1995కు ముందు… ఆ తర్వాత ఎలా ఉందో చూడాలని చంద్రబాబు అన్నారు.

సహకార సంఘాల కాలపరిమితిని మరో ఆర్నెల్లపాటు పొడిగించాలని నిర్ణయించామని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. సంక్షేమం, మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమన్న చంద్రబాబు... వచ్చే ఎన్నికల్లోగా 18 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. క్లౌడ్‌ హబ్‌ పాలసీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ పాలసీ ద్వారా 32 వేల 500 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.