Begin typing your search above and press return to search.

ఆ ఐదు బిల్డింగుల్లో బాబు ఆఫీస్ ఎక్కడ?

By:  Tupaki Desk   |   26 May 2016 5:17 AM GMT
ఆ ఐదు బిల్డింగుల్లో బాబు ఆఫీస్ ఎక్కడ?
X
యుద్ధ ప్రాతిపదికన ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం గురించి తెలిసిందే. మొత్తం ఆరు భవనాల్ని నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతానికి ఐదింటిని మాత్రమే నిర్మిస్తున్నారు. ఈ ఐదు భవనాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండే ఆఫీసు ఎక్కడ? అన్నది ఒక ప్రశ్న అయితే.. భవనాల వారీగా ఎవరెవరు ఎక్కడ ఉంటారన్నది ఒక ప్రశ్న. దీనిపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. మొత్తం ఐదు భవనాల్లో ఎవరు ఎక్కడ ఉండాలన్న అంశంపై ఉన్నతాధికారులు ఒక ప్రతిపాదనను సిద్ధం చేశారు. ఏ ఏ శాఖలు ఎక్కడ కొలువు తీరనున్నాయన్న విషయంపై అనధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సమాచారం ప్రకారం.. సీఎం చంద్రబాబుతో సహా మిగిలిన మంత్రులు.. శాఖల వారీగా భవనాల కేటాయింపు చూస్తే..

బాబు ఉండేది ఇక్కడే..

తాత్కాలిక సచివాలయ భవన సముదాయంలో మొదటి భవనంలో సీఎం చంద్రబాబు పని చేయనున్నారు. ఫస్ట్ బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ ను సీఎం చంద్రబాబుకు కేటాయించాలని భావిస్తున్నారు. ఏపీ రాష్ట్ర అధికార యంత్రాంగానికి నేతృత్వం వహించే సీఎస్ ఆఫీస్ కూడా ఈ ఫ్లోర్ లోనే ఉండనుంది. ఇక.. వివిధ విభాగాధిపతుల కార్యాలయాలు ఈ ఫ్లోర్ లోనే ఉండనున్నాయి.

సెకండ్ బిల్డింగ్ లో..

రెండో భవనంలోని గ్రౌండ్.. ఫస్ట్ ఫ్లోర్లలో ఐదుగురు చొప్పున మంత్రులు కొలువు తీరనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎనర్జీ.. ఐటీ శాఖ.. పరిశ్రమల శాఖ.. మున్సిపల్ పరిపాలన శాఖ.. పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్.. హోం మంత్రిత్వ శాఖలు ఉంటే.. ఫస్ట్ ఫ్లోర్ లో ఫైనాన్స్.. ప్లానింగ్ తో పాటు మరికొన్ని మంత్రిత్వ శాఖలు ఉండనున్నాయి.

థర్డ్ బిల్డింగ్ లో..

సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఈ భవనంలో ఉండనున్నాయి. మొదటి ఫోర్ లో ఐదుగురు మంత్రుల ఛాంబర్లు ఉండనున్నాయి. పలు మంత్రిత్వ శాఖ కార్యాలయాలు ఇందులో ఏర్పాటు చేస్తారు. అంతేకాదు.. ఉద్యోగుల పిల్లలకు అవసరమైన క్రెచ్.. ప్లే స్కూల్.. డిస్పెన్సరీలు ఈ భవనంలో ఉండనున్నాయి. అంతేకాదు.. మూడు టేబుల్ టెన్నిస్ కోర్టుల.. జిమ్.. లైబ్రరీతో పాటు.. 400 మంది కూర్చొనే వీలున్న రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తారు. ఈ భవనంలోనే సెంట్రల్ రికార్డు రూమ్ కూడా ఉండనుంది.

నాలుగో భవనంలో..

పది మంది మంత్రులు..వారి సలహాదారుల కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. గ్రౌండ్.. ఫస్ట్ ఫోర్లలో ఐదేసి చొప్పున మంత్రుల కార్యాలయాలు కొలువుతీరనున్నాయి.

ఐదో భవనంలో..

గ్రౌండ్ ఫ్లోర్ లో ఐదు మంత్రిత్వ శాఖల కార్యాలయాలు.. ఫస్ట్ ఫ్లోర్ లో మరికొన్ని మంత్రిత్వ శాఖల కార్యాలయాలతో పాటు.. విజిలెన్స్ కమిషన్.. ఓ పెద్ద మీటింగ్ హాల్ ను ఏర్పాటు చేయనున్నారు.