అధికారంపై ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి బాబు?

Tue Oct 24 2017 10:52:42 GMT+0530 (IST)

ఇటీవలి కాలంలో...ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగంలో...పరిపాలన అంశాలకంటే..రాజకీయ పరమైన అందులోనూ ఎన్నికల కోణంలో ఉంటున్న అంశాలే ఎక్కువగా ప్రస్తావనకు వస్తున్న సంగతి తెలిసిందే. కలెక్టర్లతో సమావేశంలో కూడా అధికారం గురించే బాబు చర్చించారనే గతంలో మీడియాలో వచ్చిన వార్తలు ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. దీనికి కొనసాగింపు అన్నట్లుగా...తాజాగా ఎన్నారైలతో కూడా ఏపీ సీఎం అదే మాట చెప్పారు. తిరిగి తామే అధికారంలో రానున్నట్లు ప్రకటించారు.విదేశీ పర్యటనలో భాగంగా అబుదాబీలో ఐబిపిజి - ఐసిఏఐల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షోలో సిఎం చంద్రబాబు మాట్లాడారు. ``నన్ను కొంతమంది అడిగారు - మేము పెట్టుబడులు పెట్టాక రాజకీయ సమీకరణలు మారితే పరిస్థితి ఏమిటని. నేనొకటే చెప్తున్నాను. మీకా భయం లేదు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితి ఉత్పన్నం కాదు. మేం దీర్ఘకాల వ్యూహాలతో పనిచేస్తున్నాం. ఎనభై శాతం ప్రజా సంతృప్తి లక్ష్యంగా పాలన అందిస్తున్నాం. మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం. అత్యధిక మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తాం` అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో 1.6 శాతం మెజారిటీతో గెలిచామని - ఇటీవల జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లోనూ గెలుపు మాదేనని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో 80 శాతం సంతృప్తి తీసుకొస్తున్నామని - రాజకీయ సుస్థిరతకు ఢోకా లేదన్నారు. ఆ నమ్మకం తమకుందని - ఇన్వెస్టర్లు నమ్మకంతో రావాలని - సుస్థిర ప్రభుత్వం ఉంటుందని - మళ్లీ తాము అధికారంలోకి రావటం తథ్యమని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

విద్యుత్ రంగంలో 22 మిలియన్ యూనిట్ల లోటుతో ప్రారంభమయ్యామని కేవలం 2 నెలల్లో మిగులు విద్యుత్ సాధించినట్లు చంద్రబాబు చెప్పారు. విద్యుత్ రంగంలో రెండోతరం సంస్కరణలకు వెళుతూ - సంప్రదాయేతర విద్యుదుత్పత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు వివరించారు. విద్యుత్ రంగంలో తాము దేశానికే ఆదర్శంగా నిలిచామని మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీలో అపార అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘మీరందరూ వాటిని అందిపుచ్చుకోవాలని కోరుతున్నా. నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంది. అమరావతిని కేవలం పాలనా నగరంగానే కాక విజ్ఞాన - ఆర్థిక నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టాం - ఇప్పటికే ప్రఖ్యాత విద్యాలయాలు - వర్శిటీలు - ఆసుపత్రులు అమరావతికి వచ్చాయి. పదహారు మెడికల్ కాలేజీలు వచ్చాయి.. మరే నగరానికి ఇటువంటి సదుపాయాలు లేవు.`` అని వివరించారు. అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ పై శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు. అరగంటలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని ఎలక్ట్రికల్ రవాణా వ్యవస్థ నెలకొల్పుతున్నట్లు చంద్రబాబు వివరించారు.