తొలిరోజే పెద్ద తప్పు చేశావ్ గా కమల్

Wed Feb 21 2018 13:39:22 GMT+0530 (IST)

రాజకీయాల్లోకి రావాలనుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ.. రావాలని అనుకున్న క్షణం నుంచే ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. తొందరపాటుతో ఏ చిన్న పొరపాటు చేసినా.. అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఒక సినిమా ప్లాప్ అయినా.. మరో సినిమాతో సూపర్ హిట్ కొట్టటమే కాదు... రెట్టింపు ప్రజాదరణను సొంతం చేసుకోవచ్చు. కానీ.. రాజకీయాల్లో అలా ఉండదు. ఏళ్లకు ఏళ్ల తరబడి తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతుల్ని ఒక్క మాటతో చెడిపోయే ప్రమాదం పాలిటిక్స్ లో ఉంటాయి. అందుకే.. ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాల్సిందే.మరీ చిన్న విషయాన్ని విశ్వనటుడు కమల్ హాసన్ ఎందుకు మిస్ అయ్యారో అర్థం కాని పరిస్థితి. ఈ రోజు (బుధవారం) సాయంత్రం తన రాజకీయ పార్టీ ఏర్పాటు మీద ప్రకటన చేయనున్న కమల్.. అంతకు కొద్ది గంటల ముందే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోటినుంచి వచ్చిన ఒక వ్యాఖ్య ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

పార్టీ ప్రకటించే రోజు ఉదయం.. మాజీ రాష్ట్రపతిగా.. దేశ ప్రజలకు స్ఫూర్తిదాతగా నిలిచిన దివంగత ఏపీజే అబ్దుల్ కలాం ఊరికి వెళ్లారు. అక్కడ కలాం సోదరుడ్ని కలిశారు. ఈ సందర్భంగా వాచీ బహుమానంగా అందించి.. ఆయన ఆశీస్సులు పొందారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. పార్టీ ఏర్పాటుకు కొద్ది గంటల ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు కమల్. ఈ సందర్భంగా  తాను మహాత్మ గాంధీ వీరాభిమానిగా చెప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హీరోగా అభివర్ణించారు.

మంగళవారం రాత్రి చంద్రబాబు తనకు ఫోన్ చేశారని.. ప్రజలకేం చేయాలన్న విషయం మీద సలహాలు ఇచ్చారన్నారు. కమల్ నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్య ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. ఓటుకు నోటు కేసుతో పాటు.. పలు ఆరోపణలు ఉన్న చంద్రబాబు లాంటి నేతను హీరోగా కమల్ చెప్పటం ద్వారా రాజకీయంగా తప్పు చేసినట్లుగా చెబుతున్నారు. కమల్ ప్రత్యర్థులు ఆయనపై శివాలెత్తటానికి బాబు ఫ్యాన్ అన్న మాట చాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విభజన నేపథ్యంలో ఏపీకి జరగాల్సినంత అభివృద్ది జరిగేందుకు ప్రత్యేక హోదా సాయం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. దాన్ని కేంద్రం నుంచి సాధించే విషయంలో ఆయన విఫలం కావటం.. మోడీ మీద ఒత్తిడి తేవటంలో ఆయన విఫలం కావటంపైనా విమర్శలు ఉన్నాయి. అలాంటి వేళ.. కమల్ నోటి నుంచి వచ్చిన బాబు తన హీరో అన్న మాట రాజకీయంగా నష్టం వాటిల్లేలా చేస్తుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తనను కలవటానికి వచ్చి శాలువాలు కప్పుతున్న అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన కమల్.. తనకు ఎప్పుడూ శాలువాలు వద్దని.. తానే ప్రజల శాలువాగా మారతానని.. వారికి తగినంత రక్షణ ఇప్పిస్తానన్నారు. మీడియా సమావేశానికి వచ్చిన కమల్ ను ఉద్దేశించి.. ఆయన అభిమానులు సీఎం వచ్చారంటూ నినాదాలు చేయటం గమనార్హం.

ఏపీజే అబ్దుల్ కలాం రామేశ్వరంలో చదివిన స్కూల్ కు వెళ్లాలనని అనుకున్నానని.. కానీ ఆ పాఠశాల యాజమాన్యం తనకు అనుమతి ఇవ్వలేదన్నారు. స్కూల్‌కు రాకుండా అడ్డుకోగలిగారు కానీ.. తాను నేర్చుకోవాలన్న విషయాల్ని మాత్రం అడ్డుకోలేరన్నారు. ఇంతకాలం తమిళనాడు ప్రజల గుండెల్లో తాను ఉన్నానని.. ఇకపై వారి ఇళ్లల్లో ఉండాలని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. సినిమాలు.. రాజకీయ రంగాలకు పెద్దగా తేడా లేదని.. సినిమాలతో పోలిస్తే రాజకీయాల్లో బాధ్యత ఎక్కువగా ఉంటుందన్నారు. మీడియా సమావేశంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు బాగానే చెప్పినా.. కీలకమైన బాబు విషయంలో కమల్ తప్పు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.