ఆ చిన్నారి మాటలకు కదిలిపోయిన బాబు

Fri May 19 2017 10:48:41 GMT+0530 (IST)

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిశితంగా పరిశీలిస్తే.. ఆయనలో రాజకీయ నేత కంటే కూడా సీఈవో లక్షణాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఆ మాటకు వస్తే.. ఆ విషయాన్ని ఆయనే గతంలో గొప్పగా చెప్పుకునే వారు. అయితే.. అలాంటి మాటలు మాస్ లీడర్ కు అస్సలు పనికి రావని.. అవి వరం కంటే కూడా శాపంగా మారతాయన్న విషయాన్ని గుర్తించిన ఆయన.. విపక్షంలో ఉన్న నాటి నుంచి తనను తాను రాజకీయ నేతగానే చెప్పుకోవటం షురూ చేశారు.

పదేళ్ల విరామం తర్వాత అధికారపక్ష నేతగా అవతరించినప్పటికి ఆయన నోటి నుంచి గతంలో మాదిరి సీఈవో మాటలు అస్సలు రాలేదన్నది మర్చిపోకూడదు. ఇదంతా ఎందుకంటే.. చంద్రబాబు పని విషయంలో సీఈవో మాదిరి చాలా  సీరియస్ గా ఉంటారే తప్పించి.. మిగిలిన రాజకీయ నేతల మాదిరి నాటకీయత పెద్దగా కనిపించదు.

అందుకే.. ఆయన ప్రత్యర్థులు ఆయన్ను నవ్వటం కూడా రాదంటూ ఎత్తిపొడుస్తుంటారు. ఈ తరహా విమర్శలతో కొద్దికాలంగా చంద్రబాబు అప్పుడప్పుడు నవ్వటం మొదలు పెట్టారు. ఇక.. బాబులో అదే పనిగా భావోద్వేగంతో కదిలిపోవటం కనిపించదు. తనలోని భావావేశాల్ని బయటకు కనిపించకుండా ఉంటారు. అది ఆవేశంలో అయినా.. ఆవేదనలో అయినా.

చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే ఆయన కదిలిపోయినట్లుగా కనిపిస్తుంటారు. అలాంటివి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి సీన్ ఒకటి చోటు చేసుకుంది. ఏపీ సచివాలయంలో పని హడావుడిలో ఉన్న చంద్రబాబు వద్దకు వచ్చిన ఒక చిన్నారి నోట నుంచి వచ్చిన మాటలు ఆయన్ను తీవ్రంగా కదిలించేశాయి. నా ప్రాణాలు మీరే కాపాడారు సార్ అంటూ చిన్నారి నోటి నుంచి వచ్చిన మాటలతో ఒక్కసారిగా చలించిపోయిన బాబు.. వెంటనే ఆ బాబును అక్కున చేర్చుకున్నారు.

తన తీరుకు భిన్నంగా ఆ చిన్నారిని చాలా ఆత్మీయంగా యోగ క్షేమాల గురించి పలుకరించటమే కాదు.. ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. బాబు ఇలా కదిలిపోవటం చాలా అరుదుగా చెబుతుంటారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యశ్వంత్ అనే చిన్నారికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే.. బాబు తల్లిదండ్రులకు అంతస్తోమత లేకపోవటంతో ఎన్టీఆర్ వైద్యసేవ కింద రూ.7లక్షలు అందజేశారు.

శస్త్రచికిత్స అనంతరం అతడికి వైద్యం చేసిన వైద్యులతో సహా చిన్నారి తల్లిదండ్రులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా బాబు నోటి నుంచి వచ్చిన మాటలు ఆయన్ను కదిలించి వేశాయి. చిన్నారికి వైద్య ఖర్చుల కోసం రూ.5లక్షల సాయాన్ని అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బాబులోని మరో యాంగిల్ కు అక్కడి వారంతా కదిలిపోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/