Begin typing your search above and press return to search.

గోపీచంద్‌ కు చంద్ర‌బాబు సూప‌ర్ గిఫ్ట్‌

By:  Tupaki Desk   |   23 Aug 2016 12:00 PM GMT
గోపీచంద్‌ కు చంద్ర‌బాబు సూప‌ర్ గిఫ్ట్‌
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఇప్పుడు మంచి ఆనందంలో ఉన్నారు. పీవీ సింధు రియో ఒలింపిక్స్‌లో భార‌త దేశ జెండాను రెప‌రెప‌లాడించ‌డంతో చంద్ర‌బాబు ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. స్వీడ‌న్ క్రీడాకారిణి.. మారిన్‌ తో సింధు త‌ల‌ప‌డిన ఫైన‌ల్ పోరును సీఎం చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. ఇదే విష‌యాన్ని మంగ‌ళ‌వారం ఆయ‌న సింధును స‌న్మానించిన సంద‌ర్భంగా ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు కూడా. ఇంకొక్క అడుగు వేసి ఉంటే అటుది ఇటై.. భార‌త దేశంలో కొత్త చ‌రిత్ర లిఖించ‌బ‌డేద‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ ర‌జ‌తం సాధించ‌డం గొప్ప‌విష‌య‌మేన‌ని పేర్కొన్నారు.

టాలెంట్ ఎక్క‌డ ఉంటే అక్క‌డ తాను ఉంటాన‌ని, మ‌ట్టిలో మాణిక్యాల‌ను వెలికితీసే ప‌ని చేస్తున్నాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. అదేవిధంగా గ‌తంలో తాను సీఎంగా ఉన్న‌ప్పుడు పుల్లెల గోపీ చంద్‌ ను స‌త్క‌రించి స‌న్మానించాన‌ని చెప్పుకొచ్చారు. గోపీ అకాడ‌మీ పెడ‌తానంటే గ‌చ్చిబౌలిలో ఐదెక‌రాల స్థ‌లం ఇచ్చాన‌ని చెప్పారు. అదేవిధంగా మౌలిక స‌దుపాయాలు కూడా క‌ల్పించి ఆనాడు ప్రోత్స‌హించాన‌ని - అప్పుడు వేసిన విత్త‌నం ఇప్పుడు మ‌హా వృక్షమై సింధు రూపంలో ఫ‌లాల‌ను అందిస్తోంద‌ని చెప్పారు. ఇప్పుడు విజ‌య‌వాడ‌లోనూ ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంతం అమ‌రావ‌తిలోనూ క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు.

రాజ‌ధానిలో నిర్మిస్తున్న తొమ్మిది మెగా సిటీల్లో ఒక‌దానిని కేవ‌లం క్రీడ‌ల కోస‌మే కేటాయించామ‌ని, దీనిని బ‌ట్టి తాను క్రీడ‌ల‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నానో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. ఆ క్రీడా సిటీలో గోపీకి ప‌దిహేను ఎక‌రాలు కేటాయిస్తామ‌ని - దానిలో ఆయ‌న బ్యాట్మింట‌న్ కోచింగ్ ఏర్పాటు చేయాల‌ని అన్నారు. అంతేకాకుండా అత్య‌ద్భుత‌మైన మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల‌ని గోపీకి సూచించారు. ఒక్క మ‌న స్టేట్ వాళ్లే కాకుండా దేశం స‌హా విదేశాల నుంచి కూడా నేర్చుకునేందుకు ఏపీకి త‌ర‌లి వ‌చ్చే విధంగా గోపీ దానిని తీర్చి దిద్దాల‌ని చంద్రాబాబు కోరారు.

కొంత‌మేర‌కు విరాళాలు సేక‌రించాల‌ని, అవికూడా చాల‌క‌పోతే ప్ర‌భుత్వ‌మే గ్రాంటు రూపంలో నిధులు స‌మ‌కూర్చి స్పోర్ట్స్ సిటీలో బ్యాట్మింట‌న్‌ కు పెద్ద పీట వేస్తుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇదంతా భ‌విష్య‌త్తు త‌రాల‌కోస‌మేన‌ని చెప్పుకొచ్చారు. ఒలింపిక్స్ లో పతకం సాధించకపోయినా బాగా ప్రతిభ కనబరిచాడని కిదాంబి శ్రీకాంత్‌ కు కితాబిచ్చారు. ఆయనను కూడా ప్రోత్సహించేందుకు రూ.25 లక్షలు - ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఒలింపిక్స్‌ లో పాల్గొన్న రజినీకి కూడా రూ.25 లక్షలు ఇస్తామని - గ్రూప్‌-2 ఉద్యోగం ఇస్తామ‌ని ముఖ్యమంత్రి వెల్లడించారు. క్రీడలకు కేంద్రంగా అమరావతిని తయారు చేస్తామన్నారు.