Begin typing your search above and press return to search.

’’పిన్నీ రా.. పరమాన్నం పెడతా!‘‘

By:  Tupaki Desk   |   24 July 2017 4:08 AM GMT
’’పిన్నీ రా.. పరమాన్నం పెడతా!‘‘
X
‘‘మా అమ్మకు అన్నం పెట్టలే.... కానీ పిన్నికి మాత్రం పరమాన్నం పెడుతున్నా...’’ అని ఎవరైనా చెబితే ఎలా ఉంటుంది? నమ్మశక్యమేనా? ఎంతమాత్రమూ కాదు. ఆ పరమాన్నంలో ఏదో ఒక మతలబు ఉండే ఉంటుందని అనుమానించడం సహజం. ఇప్పుడు నంద్యాలలో చంద్రబాబునాయుడుకు ప్రజల నుంచి దక్కుతున్న ఆదరణ ఇదే తీరుగా ఉంటోంది. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో.. ఎడాపెడా హామీలు గుప్పించేస్తూ... నంద్యాల తప్ప ప్రపంచంలో తనకేమీ పట్టదన్నట్లుగా చంద్రబాబు అక్కడ మాటలు కోటలు దాటిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే ఆయన ఒక ఎక్స్ క్లూజివ్ మాటచెప్పారు. ఇప్పటిదాకా ఎక్కడా చేయనివిధంగా.. ‘తన సొంత నియోజకవర్గం కుప్పం కంటె నంద్యాలకే ఎక్కువ నిధులు ఇచ్చా’ అని చంద్రబాబు చెప్పారు.

అయితే జనంలో మాత్రం ఇలాంటి ఆకట్టుకునే మాటలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నంద్యాలకు ఎక్కువ ఇస్తున్న సంగతేమో గానీ.. కుప్పం కు తక్కువ చేసిన మాట నిజమేనని ప్రజలు అనుకుంటున్నారు. తాను అక్కడ ఎటూ గెలిచిపోతాననే కాన్ఫిడెన్సు చంద్రబాబుకు ఎక్కువ కాబట్టి.. కుప్పం వాస్తవ ప్రగతి గురించి పెద్దగా పట్టించుకోలేదని, అదే నంద్యాలలో గెలవడం దుర్లభంగా ఉండేసరికి.. నిధుల వరదను పారిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటిది అవకాశవాద ప్రేమే అవుతుంది తప్ప.. వాస్తవంగా అభిమానించడం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్న వారు కూడా ఉన్నారు.

నంద్యాల మీద తాను అదనపు ప్రేమ చూపించడానికి చంద్రబాబు చాలా డొంకతిరుగుడు కారణాలు కూడా చెప్పుకున్నారు. ఒక ప్రధాని, ఒక రాష్ట్రపతి గెలిచిన నియోజకవర్గం ఇది.. అంటూ నంద్యాల ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. అంత ఘనమైనది గనుక.. అదనపు నిదులు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడ్డానంటున్నారు బాగానే ఉంది. మరి ఇంత హఠాత్తుగా మూడేళ్ల పాలన తర్వాత.. ఇప్పుడే ఎందుకు సిద్ధపడ్డారు అన్నదే జనానికి అనుమానంగా ఉంది. ఇదంతా ఎన్నికల కోసం చేస్తున్నట్లుగా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు తోఫా ఇచ్చినప్పుడే.. రోడ్ల విస్తరణకు ఆదేశించి నిదులు ఇచ్చా.. అని చంద్రబాబునాయుడు అంటున్నారు. కానీ అప్పటికే ఉపఎన్నిక రాబోతున్నదనే సంగతి తెలుసు కదా.. చంద్రబాబు ఏది చెబుతున్నా.. అది భూమా మరణం తర్వాత చేసినదే చెబుతున్నారు తప్ప.. భూమా మరణానికి ముందు నంద్యాలకు ఒరగబెట్టినట్టు చెప్పుకోడానికి ఏమీ లేదు కదా.. అని ప్రజలు చర్చించుకుంటున్నారు.