బాబు ఫాలోస్ జగన్!..మరో నిలువెత్తు సాక్ష్యం!

Mon Feb 11 2019 09:53:55 GMT+0530 (IST)

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునే టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు 46 ఏళ్ల వయసున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పూర్తిగా ఫాలో అయిపోతున్నారు. సంక్షేమ పథకాల అమలులో ఇప్పటికే జగన్ చెప్పిన మాటలను తూచా తప్పకుండా ఏకంగా అమలు చేసేస్తున్న చంద్రబాబు... నిరసనల్లోనూ జగన్ నే ఫాలో అవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగించిన క్రమంలో అటు కేంద్రం - ఇటు టీడీపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నలుపు రంగు చొక్కాలతో జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చిన ఘటనను ఎద్దేవా చేసిన చంద్రబాబు... మొన్న తాను కూడా అదే రంగు చొక్కాలతో అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు.తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ టూర్ కు నిరసనగా రాష్ట్రం మొత్తం ఆందోళనలు చేపట్టాలని చంద్రబాబు నిన్న తన పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా పిలుపు ఇచ్చారు. ఈ సందర్బంగా ఎలాంటి నిరసనలు చేపట్టాలన్న విషయంపైనా కాస్తంత క్లారిటీ ఇస్తూ... నిరసన ర్యాలీల్లో ఒక్కొక్కరు రెండు కుండలను పగుల గొట్టాలని బాబు సూచించారు. ఈ రెండు కుండల్లో ఓ కుండను బీజేపీ చేసిన అన్యాయానికి సూచన కాగా - రెండో కుండ మోదీపై ఒక్క మాట కూడా అనలేని వైసీపీ వైఖరికి సూచనగా భావించాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ తరహా నిరసనను వైసీపీ ఎప్పుడో చేపట్టింది.

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా మోదీ ఓ కుండలో మట్టిని - మరో కుండలో గంగా జలాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అమరావతికి తగినన్ని నిధులు ఇవ్వాల్సిన మోదీ సర్కారు పిడికెడు మట్టి - కుండెడు నీళ్లు ఇచ్చిందని ఎద్దేవా చేసిన వైసీపీ శ్రేణులు మట్టి కుండలను పగులగొట్టి నిరసన వ్యక్తం చేశారు. నలుపు రంగు దుస్తుల్లోనే రోడ్లపైకి వచ్చిన వైసీపీ శ్రేణులు కుండలను పగులగొట్టి నిరసన వ్యక్తం చేసిన నాటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బాబు వేసే ప్రతి అడుగు కూడా జగన్ అడుగు జాడల్లోనే నడుస్తోందని వైసీపీ శ్రేణులు సంధిస్తున్న కామెంట్లు ఇప్పుడు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.