Begin typing your search above and press return to search.

కేసీఆర్ వ్యూహమే బాబుకు శరణ్యమా...!?

By:  Tupaki Desk   |   17 Jan 2019 5:24 AM GMT
కేసీఆర్ వ్యూహమే బాబుకు శరణ్యమా...!?
X
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అంతా సిద్ధం అవుతోంది. ఎత్తులు - పొత్తులు ఖరారవుతున్నాయి. అస్త్రాలు బయటకు తీస్తున్నారు. ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసకందాయంలో పడినట్లు అయ్యిందంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రిటన్ గిఫ్ట్ ఇస్తానని బహిరంగ ప్రకటన చేశారు. దీనికి నాందీ వాచకమే కేటీఆర్.... జగన్ మోహన్ రెడ్డిల కలయిక అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇక్కడి నుంచి రాజకీయం మరింత ఘాటుగా మారుతుందంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో విజయానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారమే కారణమని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు తన ప్రచారంలో పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇక్కడేం పని అంటూ భారీ ప్రచారం చేశారు. అది బాగా పని చేసి తెలంగాణ రాష్ట సమితి విజయం సాధించిందని అంటున్నారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇదే తరహా ప్రచారానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెర తీస్తారని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ తో ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు. సమైక్యంగా ఉన్న తెలుగు వారిని విడదీసింది కేసీఆర్ అని - ఆయన మళ్లీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే ఎలా అని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని కలవగానే తెలుగుదేశం పార్టీ తన ప్రచార వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించింది. మీకు ఇక్కడేం పని అనే అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నట్లు సమాచారం. పైగా ఇదే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మస్త్రంగా మారుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పార్టీ సీనియర్ లతో తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారని - టీవీ చర్చల్లో కూడా ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్టు చెబుతున్నారు. ఇక నుంచి వారి ప్రచారం అదే కానుందని రాజకీయ పండితులు అంటున్నారు.