Begin typing your search above and press return to search.

బాబు ఫ‌స్ట్రేష‌న్ పీక్స్‌..ఆ గ్రామ‌స్తుల‌పై నిప్పులు

By:  Tupaki Desk   |   24 July 2017 6:36 AM GMT
బాబు ఫ‌స్ట్రేష‌న్ పీక్స్‌..ఆ గ్రామ‌స్తుల‌పై నిప్పులు
X
భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవ‌టం చాలా అవ‌స‌రం. అత్యుత్త‌మ స్థానాల్లో ఉన్న వారికి ఇది మ‌రింత అవ‌స‌రం. ప‌వ‌ర్ మొత్తం తమ చేతుల్లో ఉన్న వేళ‌.. త‌మ‌ను ప్ర‌శ్నించే వారిని చూస్తే అస‌హ‌నం త‌న్నుకు రావ‌టం ఖాయం. అయితే.. ఇది అంద‌రూ చేసేదే. కానీ.. కొన్ని సంద‌ర్భాల్లో త‌మాయించుకొని ఉండ‌టం చాలా అవ‌స‌రం. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంగ‌తే చూడండి. ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మైన భూముల్ని ఇచ్చేందుకు స‌సేమిరా అంటున్న రైతుల్ని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రానికి పిలిపించుకొని మ‌రీ గంట‌ల కొద్దీ స‌మ‌యాన్ని వెచ్చించి వారితో చ‌ర్చ‌లు జ‌రిపారు. చ‌ర్చ‌ల‌కు వ‌చ్చిన రైతులు స‌సేమిరా అన్నారు. ప్ర‌భుత్వం చెప్పిన దానికి నో చెప్పారు.

అంత‌మాత్రం దానికే కేసీఆర్ ఆగ్ర‌హం చెందారా? భూములు ఇవ్వ‌న‌న్న రైతుల‌పై నిప్పులు చెరిగారా? మీ అంతు చూస్తాన‌ని చెప్పారా? అంటే లేద‌ని చెప్పాలి. భోజ‌నం ఏర్పాట్లు చేస్తే.. తినేందుకు సైతం ఇష్ట‌ప‌డ‌ని వారిని స‌ముదాయించారే కానీ.. సీఎం స్థాయిలో ఉండి భోజ‌నం తిన‌మ‌ని చెప్పినా.. తిన‌రా? అంటూ ఫైర్ కాలేదు. అలా అని.. కేసీఆర్‌ కు మ‌న‌సులో కోపం ఉండ‌దా? అంటే ఉంటుంది. అలా అని అన‌వ‌స‌రంగా ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా ఏమాత్రం మంచిది కాద‌న్న విష‌యాన్ని కేసీఆర్ మిస్‌కాక‌పోవ‌టంతోనే ఆయ‌న విమ‌ర్శ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగారు. చిన్న త‌ప్పును కూడా ఎత్తి చూపించుకోలేక‌పోయారు.

కానీ.. ఇలాంటి తీరు ఏపీ ముఖ్య‌మంత్రిచంద్ర‌బాబులో మిస్ అవుతుంద‌న్న మాట వినిపిస్తోంది. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వంతో పాటు.. ముఖ్య‌మంత్రిగా చాలా సీనియ‌ర్ అని చెప్పుకునే చంద్ర‌బాబు ఈ మ‌ధ్య‌న ప్ర‌తి చిన్న విష‌యానికి ఫ‌స్ట్రేట్ అవుతున్నార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం చూస్తే.. ఈ వాద‌న నిజ‌మ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌ను నిర్వ‌హించారు చంద్ర‌బాబు.

ఈ సంద‌ర్భంగా గోస్పాడు మండ‌లం యాళ్లూరు గ్రామానికి చంద్ర‌బాబు వెళ్లారు. సీఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న ఏ గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నారో ఆ గ్రామాల్లో విద్యుత్‌ ను స‌ర‌ఫ‌రా చేస్తూ.. మిగిలిన గ్రామాల‌కు క‌రెంట్ బంద్ చేశారు. ఆ క్ర‌మంలో యాళ్లూరుకు క‌రెంటు పోయింది. అయితే.. యాళ్లూరులో ప‌ర్య‌టించే స‌మ‌యంలో ఎప్ప‌టి మాదిరే చంద్ర‌బాబు అక్క‌డి గ్రామ‌స్తుల్ని ఉద్దేశించి.. మీకేమైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా? క‌రెంటు వ‌స్తుందా? అని ప్ర‌శ్నించారు.

సీఎమ్మె స్వ‌యంగా క‌ష్టాల గురించి అడ‌గ‌టంతో విద్యుత్ స‌మ‌స్య ఉంద‌ని.. ప‌ల్లెకు 24 గంట‌ల పాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లుగా చెబుతున్నా.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం అలాంటిదేమీ లేద‌ని చెప్ప‌టం బాబుకు చిరాకు తెప్పించింది. అంతే ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు అక్క‌డి గ్రామ‌స్తుల‌కు షాక్ తినేలా చేశాయి. చంద్ర‌బాబు మాట‌ల్ని య‌థావిదిగా చెప్పాల్సి వ‌స్తే.. నేను సీఎంగా వచ్చా.. నీకు పిచ్చి పట్టిందా.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు.. తాగొచ్చావా.. నీ సమస్య ఉంటే తరువాత చెప్పుకో విచారిస్తా.. తప్పని తేలితే కేసు పెడుతా’ అంటూ హెచ్చరించటంతో అక్క‌డి గ్రామ‌స్తుల నోట మాట రాని ప‌రిస్థితి. నిజానికి ఇలా రియాక్ట్ అయ్యే క‌న్నా.. గ్రామ‌స్తులు విద్యుత్ కోత‌లు ఉన్నాయ‌ని చెప్పిన వెంట‌నే.. సంబంధిత అధికారుల్ని పిలిపించి అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యాన్ని తెలుసుకొని స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా ప్ర‌య‌త్నం చేసి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అందుకు భిన్నంగా స‌మ‌స్య‌ను చెప్పిన వారిపై చిందులు వేయ‌టం బాబు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేస్తుంద‌న్న అభిప్రాయం ప‌లువురి నోట వినిపిస్తోంది.