Begin typing your search above and press return to search.

వైసీపీ స‌పోర్ట‌ర్స్ నా స‌భ‌ల‌కు రావ‌ద్దు: బాబు

By:  Tupaki Desk   |   27 July 2017 8:12 AM GMT
వైసీపీ స‌పోర్ట‌ర్స్ నా స‌భ‌ల‌కు రావ‌ద్దు: బాబు
X
గుంటూరులో జ‌రిగిన వైసీపీ జాతీయ ప్లీన‌రీ త‌ర్వాత ఏపీ సీఎం చంద్ర‌బాబు వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పులు వ‌చ్చాయి. రాబోయే ఎన్నిక‌ల్లో అధికారం దక్క‌దేమోన‌న్న బెంగ చంద్ర‌బాబుకు ప‌ట్టుకుంది. నంద్యాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌లే ఇందుకు నిద‌ర్శ‌నం. నేను ఓటుకు ఐదు వేలిచ్చి కొన‌గ‌ల‌ను... నాకు ఓటు వేయ‌ని గ్రామాల‌కు ఓ దండం పెడ‌తాను.....అంటూ కొద్ది రోజుల క్రితం నంద్యాల‌లో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. నంద్యాల‌లో ఓట‌మి భ‌యంతోనే చంద్ర‌బాబు మ‌రోసారి సంయ‌మ‌నం కోల్పోయారు. గ‌తంలో మాదిరిగానే చంద్ర‌బాబు మ‌రోసారి ప్ర‌జ‌ల‌పై మండిప‌డ్డారు. నంద్యాల‌లో ప్ర‌చారం సంద‌ర్భంగా విద్యుత్ కోత‌ల గురించి ప్ర‌శ్నించిన ఓ వ్య‌క్తిపై చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

నంద్యాల ఉప ఎన్నిక‌లో గెలుపు కోసం చంద్ర‌బాబు ఆ నియోజ‌క‌వ‌ర్గం కోసం వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ఎలాగైనా గెల‌వాల‌ని స్వ‌యంగా చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఈ ప్ర‌చారం సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఓ స‌భ‌లో మాట్లాడుతూ...తాను చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల గురించి ప్ర‌సంగిస్తున్నారు. ఇంత‌లో, ఓ వ్య‌క్తి త‌మ ప్రాంతంలోని విద్యుత్ కోత‌ల గురించి చంద్ర‌బాబును ప్ర‌శ్నించాడు. దీంతో చంద్ర‌బాబు ఆ వ్య‌క్తి పై ఆగ్ర‌హంతో ఊగిపోయారు.

ఆ వ్య‌క్తిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ''నీకేమైనా పిచ్చి ప‌ట్టిందా? మ‌ందు కొట్టి వ‌చ్చావా? నేనిక్క‌డికి ముఖ్య‌మంత్రి హోదాలో వ‌చ్చాను. పార్టీ కార్య‌క‌ర్త‌ల ముందు న‌న్ను ప్ర‌శ్నించ‌డానికి నీకు ఎంత ధైర్యం? ఒక వేళ నువ్వు వైసీపీ మ‌ద్ద‌తుదారుడ‌వైతే నా స‌భ‌ల‌కు రాకుండా ఇంటి ద‌గ్గ‌రే ఉండు'' అని ఆ వ్య‌క్తిపై మండిప‌డ్డారు. చంద్ర‌బాబు చేసిన ఆ వ్యాఖ్య‌ల‌ను జాతీయ మీడియా ప్ర‌త్యేకంగా క‌వ‌ర్ చేసింది. మొన్న‌టికి మొన్న ముస్లిం ఓట‌ర్ల‌కు చంద్ర‌బాబు హుకుం జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. మీరు ప్రేయర్ చేస్తారో, క‌న్విన్స్ చేస్తారో నాకు తెలియ‌దు....మీ ఓట్ల‌న్నీ టీడీపీకే వేయాలి అంటూ ముస్లిం ఓట‌ర్ల‌ను చంద్ర‌బాబు మ‌భ్య‌పెట్ట‌డం చూస్తుంటే నంద్యాల‌లో గెలుపున‌కు ఆయ‌న ఎంత తాప‌త్రేయ‌ప‌డుతున్నారో తెలుస్తోంది.