Begin typing your search above and press return to search.

బాబు నోట రాజీనామా మాట‌!..అఖిల మాటేంటో!

By:  Tupaki Desk   |   21 Nov 2017 4:36 AM GMT
బాబు నోట రాజీనామా మాట‌!..అఖిల మాటేంటో!
X
న‌వ్యాంధ్ర పొలిటిక‌ల్ కేపిట‌ల్ విజ‌యవాడ‌లో మొన్నామ‌ధ్య జ‌రిగిన బోటు ప్ర‌మాదం... టీడీపీ స‌ర్కారును ఇంకా వెంటాడుతూనే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 22 మంది ప్రాణాల‌ను బ‌లిగొన్న ఆ ప్ర‌మాదానికి సంబంధించి ఇప్ప‌టికే ప‌ది మందిని పోలీసులు అరెస్ట్ చేయ‌గా... ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హించాల్సిన ప‌ర్యాట‌క శాఖ‌... త‌న కింద ప‌నిచేస్తున్న కొంద‌రు ఉద్యోగుల‌ను స‌స్పెండ్ చేసింది. అయితే ఏ పాపం తెలియ‌ని త‌మ‌ను ఎలా స‌స్పెండ్ చేస్తార‌ని ఇప్పుడు స‌స్పెండ్ అయిన ఉద్యోగులంతా ఒక్క‌రొక్క‌రుగా కోర్టుల‌ను ఆశ్ర‌యించే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే ఒక‌రిద్ద‌రు లోకాయుక్త‌లో ఈ స‌స్పెన్ష‌న్ల‌పై పిటిష‌న్లు కూడా దాఖ‌లు చేసిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్ర‌మాదానికి గురైన బోటుకు సంబంధించిన వ్య‌క్తులు... ఓ కీల‌క మంత్రికి అత్యంత స‌న్నిహితుల‌ని, వారి డ‌బ్బు యావ వల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని మీడియా కోడై కూస్తున్నా కూడా ప్ర‌భుత్వం చూసీ చూడ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో ఇక ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నీ గ‌త స్మృతులుగా మారుతున్న త‌రుణంలో నిన్న సాయంత్రం ఓ సంచ‌ల‌న విష‌యం చోటుచేసుకుంది.

నిన్న వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో అధికారులు - మంత్రుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... స‌మీక్ష ముగిసిన త‌ర్వాత నంది అవార్డుల‌పై రేగిన వివాదం మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌తి దానికీ కుల ప్రాతిప‌దిక తెస్తున్నార‌ని, ఇది స‌వ్యంగా లేద‌ని - అయినా అవార్డుల‌ను తాను గానీ ఇస్తానా? అని కూడా ఆయ‌న ఓ రేంజిలో ఫైర‌య్యారు. ఆ త‌ర్వాత అదే కోపంతో ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తున్న సంద‌ర్బంగా అక్క‌డ నిల‌బ‌డ్డ అధికారులు - మంత్రుల వ‌ద్ద ఆయ‌న కాసేపు ఆగార‌ట‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఎదురుగా ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా ఉన్న భూమా అఖిల‌ప్రియ ఉన్నార‌ట‌. అఖిల‌ను చూడ‌గానే బాబుకు ప‌డ‌వ ప్ర‌మాదం గుర్తుకు వ‌చ్చిందో, ఏమో తెలియ‌దు గానీ... అక్క‌డికక్క‌డే ఆయ‌న ప‌డ‌వ ప్ర‌మాదంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌. 22 మంది ప్రాణాల‌ను హ‌రించేసిన ఈ ప్ర‌మాదానికి బాధ్యులు ఎవరు? అని ప్ర‌శ్నించార‌ట‌. అయితే ఏదో ఫ్లోలో చంద్ర‌బాబు అలా అంటున్నారులే అని అక్క‌డున్న‌వారంతా... చాలా సైలెంట్‌ గానే ఉన్నార‌ట‌.

అయినా కూడా చంద్రబాబు మ‌ళ్లీ అదే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ... *బోటు ప్ర‌మాదానికి బాధ్య‌త వ‌హించాల్సింది ప‌ర్యాట‌క శాఖే క‌దా. గతంలో శాఖాపరమైన బాధ్యతలకు మంత్రులు రాజీనామా చేసేవారు. బోటు ప్రమాదం జరిగితే ఆ శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా* అని అఖిలను ఉద్దేశించి చంద్ర‌బాబు కాస్తంత క‌టువుగానే మాట్లాడార‌ట‌. ఊహించ‌ని ఈ ప‌రిణామానికి ఎలా స్పందించాలో కూడా తెలియ‌ని అఖిల అలా మౌనంగా నిల‌బ‌డిపోయింద‌ట‌. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అదే ఫ్లోను కొన‌సాగించిన చంద్ర‌బాబు.. శాఖల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌నే ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌. మొత్తంగా ఈ ఎపిసోడ్ చూస్తుంటే... ఈ కేసు మ‌రింత‌గా జ‌ఠిల‌మైతే మాత్రం అఖిల త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌క త‌ప్ప‌ద‌న్న కోణంలోనే చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి అదే ప‌రిస్థితి వ‌స్తే... అఖిల - ఆమె త‌మ్ముడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిల ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.