Begin typing your search above and press return to search.

అచ్చెన్నాయుడుపై బాబు అక్షింత‌లు

By:  Tupaki Desk   |   29 Sep 2016 11:07 AM GMT
అచ్చెన్నాయుడుపై బాబు అక్షింత‌లు
X
తెలుగుదేశం ప్ర‌భుత్వంపై - ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై చిన్న కామెంట్ వినిపించినా ముందుగా ఎదురుదాడి చేసేది ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. అలాంటి అచ్చెన్నాయుడుపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని తెల‌సింది. కలెక్టర్ల సమావేశం సందర్భంగా ఈ మేర‌కు అచ్చెన్నాయుడు ప‌నితీరుపై బాబు మండిప‌డ్డ‌ట్లు స‌మాచారం. ఆయ‌న‌తో పాటు శ్రీకాకుళం కలెక్టర్‌ మీద సైతం బాబు ఆగ్రహం వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం.

వివిధ పథకాల అమలు - సహజ వనరుల వినియోగం - నీరు - సాధారణ పాలన - సామాజికాభివృద్ధి తదితర అంశాలపై ప్రభుత్వం ప్రకటించిన రేటింగ్‌ల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో వివ‌రించారు. ఈ రేటింగ్‌ల‌లో తూర్పుగోదావరి - ప్రకాశం జిల్లాలు ప్రథమ - ద్వితియ‌ స్థానంలో నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉంది. జిల్లాల పనితీరుకు ఎ - ఎ ప్లస్‌ - ఎ డబుల్‌ ప్లస్‌ గా మూడు రకాల రేటింగ్స్‌ ఇచ్చారు. తూర్పుగోదావరి - ప్రకాశం ఎ డబుల్‌ ప్లస్‌ సాధించాయి. అన్ని రకాల పనుల ఆధారంగా - ప్రభుత్వం నిర్వహించిన సర్వేల ఆధారంగా ఈ రేటింగ్స్‌ ఇచ్చినట్లు సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. అతి పెద్ద తీరం - అన్ని రకాల వనరులూ శ్రీకాకుళంలో పుష్కలంగా ఉన్నా వాటినెందుకు వినియోగించుకోవడం లేదని సీఎం ప్రశ్నించారు. సీనియర్‌ ప్రజాప్రతినిధిగా ఉన్న అచ్చెన్నాయుడు రెండున్నరేళ్లు గడుస్తున్నా జిల్లా అభివృద్ధిపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. దీంతో అచ్చెన్నాయుడి ముఖం చిన్నబోయిందని స‌మాచారం. కాగా ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ల‌ పైనా బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాబు వ్యాఖ్యానించారు. అందుకే ఇక‌నుంచి డివిజన్‌ స్థాయి నుండి మానిటరింగ్‌ చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు కలెక్టర్ల చేతుల్లోనే కాకుండా అధికారులందరికీ వెళ్లేలా కమాండ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్నట్లు చంద్ర‌బాబు అన్న‌ట్లుగా తెలిసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/