Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు కోవర్టుల భయం.. ముందు జాగ్రత్త?

By:  Tupaki Desk   |   23 April 2019 1:30 PM GMT
చంద్రబాబుకు కోవర్టుల భయం.. ముందు జాగ్రత్త?
X
తెలుగుదేశం పార్టీలో కోవర్టులు ఉన్నారన్నట్టుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం ఒకింత సంచలనంగానే మారింది. ప్రత్యేకించి ఇప్పుడు కాదు కానీ, ఫలితాలు వచ్చాకా.. హంగ్ తరహా పరిస్థితి వస్తే.. అనే కోణంలో కూడా బాబు ఆలోచనలు సాగుతున్నట్టుగా ఆయన సమీక్ష సమావేశాలతో బయటపడింది. చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిదాయకంగా మారింది.

ఎన్నికల ఫలితాల్లో హంగ్ తరహా పరిస్థితి ఏర్పడి.. ప్రతి ఎమ్మెల్యే కూడా కీలకమే అయ్యే పరిస్థితి వస్తే అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు తన గుప్పిట నుంచి చేజారే అవకాశాలున్నాయనే భయం తెలుగుదేశం అధినేతలో ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తగా వహించాలని ఆయన పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. ఏపీలోని నూటా డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీ చేసిన అభ్యర్థులతో చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో బాబు కోవర్టుల గురించి కూడా వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం.

పార్టీలో అలాంటి వారు ఎవరున్నారో గుర్తించినట్టుగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఎన్నికలకు ముందే పలువురు నేతలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వారి విషయంలో చంద్రబాబు నాయుడు కొన్ని ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో సదరు నేతలకు ఆస్తులు ఉన్నాయని, వాటి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు బెదిరింపులకు పాల్పడి చేర్చుకున్నారు.. అంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

ఆ విషయంలో అసలు కథ ఏమిటో కానీ.. రేపు హంగ్ తరహా పరిస్థితి వస్తే.. హైదరాబాద్ లో వ్యాపారాలు, ఆస్తులు కలిగిన టీడీపీ ఎమ్మెల్యేలను మళ్లీ అదే తరహాలో తీసుకుపోతారేమో.. అనే విషయాన్ని పార్టీ నేతల ముందు చంద్రబాబు నాయుడు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. అయినా హంగ్ తరహా ఫలితాలు వచ్చినప్పుడు కదా.. అలాంటి లొల్లి!