Begin typing your search above and press return to search.

చంద్రబాబు వద్దనుకున్నదే ఎదురొస్తోంది..

By:  Tupaki Desk   |   22 March 2018 5:37 PM GMT
చంద్రబాబు వద్దనుకున్నదే ఎదురొస్తోంది..
X
రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో సిద్ధహస్తుడైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల నాటికి మోదీతో కలిసుంటే దెబ్బయిపోతామని గ్రహించే మెల్లగా జారుకున్నారన్న మాట అంతటా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత.. వివిధ వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా కదిలివస్తుండడం.. కలిసికట్టుగా ఉద్యమాలకు సిద్ధమవతుండడం చూసి మోదీ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకున్న ఆయన.. మోదీతో ఉంటే ఆ ప్రభావం తమపైనా పడుతుందన్న భయంతో ఫ్రెండ్ షిప్ వదులుకున్న సంగతి తెలిసిందే. అయితే... ఏ వ్యతిరేకత అయితే తన వరకు రాకూడదని అనుకున్నారో ఇప్పుడు అదే వ్యతిరేకతను చంద్రబాబు భారీ స్థాయిలో ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేసే సినీ రంగం నుంచి ఆయన ఊహించని విధంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆ రంగానికి చెందిన పవన్ పూర్తిగా ఆయనపై దండయాత్రకు రెడీ అవుతుండడం ఒకెత్తయితే.. తమ్మారెడ్డి భరద్వాజ - పోసాని వంటివారు ఇప్పుడు చంద్రబాబుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇంకా బయటకు రానప్పటికీ సినీ ప్రముఖులు చాలామంది చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టాక్.

నిజానికి చిత్రపరిశ్రమలో చాలామంది టీడీపీకి అనుకూలంగా ఉండేవారు. కానీ... అదిప్పుడు కనిపించడం లేదు. పవన్‌ అడ్డం తిరిగిన నేపథ్యంలో చిత్రపరిశ్రమ నుంచి బహిరంగ మద్దతు కోరుకుంది టీడీపీ. అందులో భాగంగానే చంద్రబాబు 15 రోజుల క్రితం మొదలుపెట్టిన ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు పలకాలంటూ వారిని రెచ్చగొట్టారు టీడీపీ నేతలు. కానీ, అది కాస్త వికటించింది. మద్దతు పలకలేదు సరికదా.. రివర్సవుతున్నారు.

పైగా టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేందప్రసాద్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు చిత్రపరిశ్రమ పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో పరిశ్రమను టీడీపీ అవమానించిందన్న టాక్ ఒకటి మొదలైంది. దీంతో పరిశ్రమలో టీడీపీ అనుకూల వర్గాలు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. నిజానికి మొన్నటి నంది అవార్డుల వివాదంతోనే చంద్రబాబుపై సినీ పరిశ్రమలో చాలామందికి వ్యతిరేక ఏర్పడిందని చెప్తున్నారు.

ఇక రాష్ర్టంలో కాపులు సహా పలు కులాలు చంద్రబాబు మాయమాటలతో తమను మోసగించారని ఆగ్రహంగా ఉన్నారు. అలాగే నిరుద్యోగులు, విద్యార్థులు కూడా మండిపడుతున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు కొత్తగా ఇప్పుడు నోట్ల కష్టాలు ఏపీ ప్రజలను బాధిస్తున్నాయి. అప్పుడు నోట్ల రద్దు వల్ల ఇలాంటి పరిస్థితలు ఏర్పడగా ఇప్పుడు టీడీపీ కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు. ఎన్నికల కోసం క్యాష్ రెడీ చేసుకోమని టీడీపీ నేతలకు ఆదేశాలు అందాయని.. అందుకే బ్యాంకులు, ఏటీఎంలపై టీడీపీ నేతలు, అనుచరులు పడుతున్నారని.. దాని వల్లే కరెన్సీ కొరత ఏర్పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బ్యాంకుకో - ఏటీఎంకో వెళ్లి డబ్బులు దొరక్క నిరాశగా వెనుదిరుగుతున్న ప్రతి ఒక్కరూ చంద్రబాబునే నిందిస్తున్నారు. దీంతో... ఆయన భయపడుతున్న వ్యతిరేకత ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నట్లవుతోంది.