Begin typing your search above and press return to search.

పవర్ లేని వేళ కెలుక్కుంటే ఇలానే ఉంటుంది బాబు?

By:  Tupaki Desk   |   21 Sep 2019 10:42 AM GMT
పవర్ లేని వేళ కెలుక్కుంటే ఇలానే ఉంటుంది బాబు?
X
రాజకీయాల్లో ఉన్నప్పుడు పరిస్థితుల మీద అవగాహన చాలా ముఖ్యం. ఏ విషయం మీద ఏ సందర్భంలో రియాక్ట్ కావాలి? ఏ సందర్భంలో కామ్ గా ఉండాలన్నది అత్యంత కీలకం. ఆ విషయంలో జరిగే పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. చారిత్రక ఓటమి తర్వాత కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తీరు మారలేదు. ఎన్నికల్లో బాబును ఘోరంగా తిరస్కరించిన ఏపీ ప్రజలు.. ఆయన పాలనపై తమకు ఆగ్రహాన్ని ఓట్లతో చెప్పేశారు. ఇలాంటివేళ.. మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం చాలా అవసరం.

కానీ.. నిత్యం ఏదో విషయం మీద మాట్లాడటం.. మీడియా అటెన్షన్ తన మీద ఉండాలనుకోవటం బాబుకు మొదట్నించి ఉన్నదే. తాను రాజకీయం మొదలుపెట్టిన రోజుల మాదిరే ఇప్పటి రాజకీయం ఉందన్న భావన నుంచి బాబు బయటకు రావటం లేదా? అన్న అనుమానం కలిగేలా ఆయన తీరు ఉంటోంది.

మీడియా.. సోషల్ మీడియా పరిధి పెరిగిపోయిన నేపథ్యంలో చిన్న పొరపాటుకు సైతం చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్న విషయాన్ని బాబు అదే పనిగా మర్చిపోతున్నారు. కోడెల ఆత్మహత్య నేపథ్యంలో.. తన గుస్సాను అధికారపక్షంతో పాటు..ఏపీ పోలీసుల్ని కూడా తీసుకొచ్చి పెద్ద తప్పు చేశారు.

తాను అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల పట్ల ఎలా వ్యవహరించానో.. అదే రీతిలో అధికారం ఉన్న వారు వ్యవహరిస్తారన్న సింఫుల్ లాజిక్ ను బాబు ఎందుకు మర్చిపోతారు. పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా మారినట్లుగా నిందించటంతో పాటు.. వారిపై పలు ఆరోపణలు చేశారు. దేశంలోని మరే విపక్ష అధినేత చేయని రీతిలో పోలీసుల మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు బాబు.

ఇలాంటి తీరు బాబుకు ఏ మాత్రం మేలు చేయదన్న అంచనాకు తగ్గట్లే.. తాజాగా ఏపీ పోలీసుల సంఘం మాజీ ముఖ్యమంత్రి మాటల్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు.. ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్ ఖాన్ తదితరులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పోస్టింగుల కోసం పోలీసులు కక్కుర్తి పడి.. అధికార పార్టీ నేతలు ఏం చెబితే అది చేస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయటం పోలీసుల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయన్న అభ్యంతరాన్ని వారు వ్యక్తం చేశారు.

పోలీసులు శాంతిభద్రతల కోసం శ్రమిస్తారే తప్పించి.. పోస్టింగుల కోసం కక్కుర్తిపడాల్సిన అవసరం తమకు లేదని వారు పేర్కొన్నారు. నిజాయితీగా పని చేసే పోలీసుల మనోభావాల్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేయటం బాబుకు తగదని వారు తేల్చి చెప్పారు. పవర్ పోయి సరిగ్గా నాలుగు నెలలు కాక ముందే.. భద్రతలో కీలక భూమిక పోషించే పోలీసుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి రావటం బాబు వ్యూహలోపంగా చెప్పక తప్పదు. ఇలా.. ఒకరి తర్వాత ఒకరు చొప్పున అందరి ఆగ్రహాన్ని గురి కావటం విపక్ష నేతకు ఏ మాత్రం మంచిది కాదు. ఆ విషయాన్ని బాబు ఎందుకు మిస్ అవుతున్నట్లు?