Begin typing your search above and press return to search.

చంద్రబాబు వద్ద రూ.10 కూడా లేవ్!

By:  Tupaki Desk   |   21 July 2017 12:04 PM GMT
చంద్రబాబు వద్ద రూ.10 కూడా లేవ్!
X
డబ్బు కోసం తాను రాజకీయాలు చేయడం లేదని, కేవలం ప్రజాసేవ కోసమే - రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడం కోసమే రాజకీయాల్లో ఉన్నానని చంద్రబాబునాయుడు పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. తనకు సంపాదన మీద ఆసక్తి లేదని కూడా అంటూ ఉంటారు. అది ఒక రకంగా నిజమే కావచ్చు. ఎందుకంటే.. చంద్రబాబు జేబులో కనీసం పది రూపాయలు కూడా లేవు. ఆర్టీసీ బస్సు ఎక్కి టిక్కెట్ తీసుకోవాల్సి వచ్చేసరికి.. చంద్రబాబునాయుడు పాపం.. తన సెక్యూరిటీ నుంచి అప్పుతీసుకోవాల్సి వచ్చింది. ఈ తమాషా సంఘటన ఆయన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉండగా జరిగింది.

కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబునాయుడుకు తిరుగులేని రీతిలో పట్టం కడుతున్న కుప్పం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఆయన మెజారిటీ బాగా తగ్గింది. దీంతో ఈ దఫా ఆయన నియోజకవర్గం మీద కాస్త దృష్టి పెంచారు. ఆయన సొంతంగా చేయించుకున్న సర్వేల్లో కూడా ఫలితాలు ప్రతికూలంగా రావడంతో కుప్పంలో పర్యటించే ఫ్రీక్వెన్సీ పెంచారు. చంద్రబాబు తరఫున ఇక్కడి వ్యవహారాలు చూస్తూ ఉండే లోకేష్ కూడా తరచూ పర్యటిస్తున్నారు. ఇలాంటి వాటిలో భాగంగా ప్రస్తుతం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. ఒక లోకల్ ఆర్టీసీ బస్సు సర్వీసును కూడా ప్రారంభించారు.

బస్సును ప్రారంభించిన తర్వాత అందులో కాసేపు ప్రయాణించదలచుకున్న ఆయన , బస్సులోని లేడీ కండక్టరు వద్ద టికెట్ కూడా తీసుకున్నారు. కానీ ఆమెకు ఇవ్వడానికి ఆయన జేబులో డబ్బుల్లేవు. దాంతో చంద్రబాబు వెనుక సీట్లో సెక్యూరిటీ నిమిత్తం కూర్చున్న పోలీసు తన జేబులోంచి తీసి ఇచ్చిన కరెన్సీ నోటునే చంద్రబాబు కండక్టరుకు ఇచ్చారు.

చంద్రబాబు వద్ద పాపం... పది రూపాయలు కూడా లేవంటూ చూసిన వారు ఛలోక్తులు వేసుకోవడం కనిపించింది.