Begin typing your search above and press return to search.

బాబు బేరం - తెదేపా ఎంపీలకు శఠగోపం!

By:  Tupaki Desk   |   16 Jan 2018 5:28 AM GMT
బాబు బేరం - తెదేపా ఎంపీలకు శఠగోపం!
X
చంద్రబాబునాయుడు దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత.. హస్తినాపురానికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోడీ తో భేటీ అయి.. 40 నిమిషాల పాటు గడిపి.. ఆ తర్వాత రెండు గంటలపాటూ ప్రెస్ మీట్ పెట్టి.. సాధించినది ఏమిటి? ఈ భేటీల రాజకీయ బేరం తప్ప రాష్ట్రానికి సంబంధించి.. కీలక నిర్ణయాలు ఏం జరగలేదా? చంద్రబాబు జస్ట్.. రాష్ట్రం ఎదుర్కొనే కష్టాలన్నీ ఒక లేఖ రాసి.. మోడీ చేతిలో పెట్టేసి.. వచ్చే ఎన్నికలకు రాజకీయ ఒప్పందాల గురించి బేరసారాలు మాట్లాడుకుని వచ్చినట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. మోడీ-చంద్రబాబు ల మద్య కుదిరిన ఒప్పందం ఇదీ అంటూ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్ లీక్ చేసినట్లుగా ఒక కామెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం అచ్చంగా.. చంద్రబాబు – మోడీల మధ్య అచ్చంగా రాజకీయ భేటీ మాత్రమే జరిగింది. మరో ఏడాది తర్వాత వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి పొత్తులతో ముందుకు వెళ్లాలనే విషయమే వారు మాట్లాడుకున్నారు.. అని తెలుస్తోంది. అదే నిజమైతే గనుక.. తెదేపా ఎంపీలకు చంద్రబాబు శఠగోపం పెట్టినట్టే లెక్క.

ఇంతకూ వారి మధ్య కుదిరిన బేరం ఏంటా? అని ఆలోచిస్తున్నారా? సీట్ల పంపకం గురించి. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో పూర్తిగా తెలుగుదేశమే పోటీచేసేలా, ఉన్న 25 ఎంపీ స్థానాలను పూర్తిగా భాజపాకు విడిచిపెట్టేలా ఒప్పందం కుదిరిందిట. అసలే మోడీ తో సంబంధాల విషయంలో.. తన పరంగా ఉన్న అనేక పరిమితులు, లోపాల దృష్ట్యా మోడీ ఏం చెప్పినా సరే దానికి ఓకే అనడం తప్ప వేరే గత్యంతరం లేని స్థితిలో ఉన్న చంద్రబాబునాయుడు ... ఈ ప్రతిపాదనను కూడా అంగీకరించేశారని ఉండవిల్లి మాటల వలన తెలుస్తోంది.

అదే జరిగితే తెలుగుదేశం ప్రస్తుత ఎంపీలందరికీ శఠగోపం పెట్టినట్టే లెక్క. నిజానికి తెలుగుదేశం పార్లమెంటు సభ్యులుగా దిగ్గజాలు అనదగిన నాయకులనుంచి పార్టీకి ఎంతో కీలకంగా ఉపయోగపడే నాయకుల వరకు పలువురు ఉన్నారు. అలాంటి వారినందరూ ఇక ఢిల్లీ ఆశలు వదులు కోవాల్సి వస్తుంది. అంటే ఆ ఎంపీ అభ్యర్థులందరికీ కూడా.. రాష్ట్ర అసెంబ్లీ సీట్లనే సర్దుబాటు చేయాల్సి వస్తుంది. అసలే ప్రస్తుతం ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జిలతోనే చంద్రబాబు సతమతం అయిపోతున్నారు. దానికి తోడు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఫిరాయింపజేసి తెచ్చుకున్న నాయకులతో ఆధిపత్యం పరంగా బోలెడు చికాకులు పార్టీకి కలుగుతున్నాయి. ఇన్నింటి మధ్యలో మళ్లీ ఎంపీలను కూడా అసెంబ్లీ బరిలోకి తెచ్చుకుని తలనొప్పులు పడడం అంటే కష్టమే మరి!!