Begin typing your search above and press return to search.

కేంద్రంపై బాబు పోరాటం చేస్తున్న‌ట్లేనా?

By:  Tupaki Desk   |   20 Jan 2018 4:26 AM GMT
కేంద్రంపై బాబు పోరాటం చేస్తున్న‌ట్లేనా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు తాజా కామెంట్ల‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారని...వాటిని నిశితంగా గ‌మ‌నిస్తే...విభజన హామీలపై కేంద్రంతో పోరాటానికి సై అన్నారని ప‌లువురు అంటున్నారు. పోలవరం స్పిల్ వే టెండర్లపై కేంద్రం దిగొచ్చేలా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. విభజన చట్టంలోని హామీల సాధనపైనా ఫోకస్ చేశారని.. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమన‌డం ఇందుకు సంకేతమని అంటున్నారు.

క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో మాట్లాడుతూ దేశం కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువన్న నీతి ఆయోగ్ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్ వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుపట్టారు. విభజనతో జరిగిన అన్యాయాన్ని సరిచేయమంటే ఆలస్యం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో తలసరి ఆదాయంలో అట్టడుగున ఉన్నామన్నారు. ఏపీ ప్రజలకు సామర్థ్యం లేక ఆదాయం తగ్గలేదని - విభజన హేతుబద్దంగా లేకపోవడం వల్లే సమస్యలన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానస్థాయికి చేరుకునే వ‌రకు కేంద్రం సాయం చేయాల్సి ఉందన్నారు.పెద్దన్న పాత్ర పోషించాల్సిందిగా కేంద్రాన్ని అడుగుతామని, అయినా స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం స్పష్టం చేశారు.

తెలంగాణను ఆంధ్ర పాలకులు ధ్వంసం చేశారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాబట్టే అందరూ వెళ్లారని - మళ్లీ అక్కడి నుంచి రమ్మనడమేంటన్నారు. అభివృద్ధిలో తెలంగాణకు ఏపీకి పోలికేలేదన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు కౌంటరిచ్చారు. తెలంగాణను ఆంధ్రా పాలకులు ధ్వంసం చేశారన్న వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 1995కు ముందు.. తరువాత హైదరాబాద్‌ అభివృద్ధిని గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభజన హామీలపై న్యాయపోరాటం చేస్తామన్న చంద్రబాబు కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఏపీ సీఎం సిద్ధమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బాబు ఇంత ఘాటుగా రియాక్ట‌య్యేందుకు కార‌ణ‌మేంట‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.