బాబు కండీషన్ విని...బీజేపీ అవాక్కైందట!

Sun Aug 13 2017 13:53:08 GMT+0530 (IST)

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పుడు ప్రచారం పతాక స్థాయికి చేరుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రెండు సార్లు నంద్యాలలో పర్యటించారు. ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడ నాన్ స్టాప్ రోడ్ షోలకు తెర తీశారు. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే పోటీ జరుగుతున్నా... ఇతర మిత్రపక్షాల నుంచి కూడా టీడీపీ మద్దతు కోరుతోంది. వైసీపీ సింగిల్ గానే బరిలోకి దిగగా... ఇటు రాష్ట్రంలోనే కాకుండా అటు కేంద్రంలో కూడా తనకు మిత్రపక్షంగా కొనసాగుతున్న బీజేపీ మద్దతును చంద్రబాబు స్వయంగానే కోరినట్లుగా కమలనాథులు చెబుతున్నారు. మిత్రపక్ష పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు కోరికను బీజేపీ నేతలు కూడా మన్నించారనే చెప్పాలి. ఎందుకంటే... నంద్యాలలో తమ పార్టీ అభ్యర్థి బరిలో లేరు కాబట్టి... మిత్రపక్షం అభ్యర్థి విజయానికి బీజేపీ నేతలు శ్రమించేందుకు సిద్ధంగానే ఉన్నారన్న మాట కాదనలేనిదే.ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచార బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న బీజేపీ నేతలకు చంద్రబాబు నుంచి ఓ కండీషన్ వినిపించిందట. అంతే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు.. నంద్యాలలో తాము ప్రచారానికి వెళ్లేది లేదని తేల్చి చెప్పేశారు. అయినా ప్రచారానికి సిద్ధమంటూనే... చంద్రబాబు సింగిల్ కండీషన్ పెట్టగానే వారంతా ఎందుకు విరమించుకున్నారన్న విషయానికి వస్తే... చంద్రబాబు పెట్టిన కండీషన్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. నంద్యాలలో తమ పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిందేనని అయితే బీజేపీ కండువాలు గానీ - బీజేపీ జెండాలు గానీ పట్టుకోకుండా రావాలని చంద్రబాబు బీజేపీ నేతలకు కండీషన్ పెట్టారట. నిజంగానే తాముంటున్న పార్టీ జెండా కండువా లేకుండా రమ్మంటే... ప్రతి ఒక్కరు కూడా ఆవేదనకు లోనవడం సర్వసాధారణమే.

ఈ క్రమంలోనే చంద్రబాబు కండీషన్ విన్న బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. అయినా కండువా జెండా లేకుండా రావాలని బీజేపీ నేతలకు చంద్రబాబు ఎందుకు చెప్పారన్న విషయానికి వస్తే... నంద్యాలలో ముస్లిం మైనారిటీల ఓట్లు చాలానే ఉన్నాయి. అసలు నంద్యాలలో ముస్లిం ఓటర్లు ఎటు మొగ్గితే విజయం అటేనన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో హిందూత్వ వాదంతో ముందుకెళుతున్న బీజేపీ.. కమలం కండువాలు జెండాలతో ప్రచారానికి వస్తే... ముస్లింలు టీడీపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని కూడా చంద్రబాబు భావించారు. ఈ క్రమంలోనే ఆయన జెండాలు - కండువాలు లేకుండా ప్రచారానికి రావాలని బీజేపీ నేతలకు షరతు విధించారు.

ఈ అంశంపై నిన్న విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల భేటీలో కర్నూలు నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును నిలదీశారట. మిత్రపక్షం పార్టీ అధినేత ఇలాంటి వింత కండీషన్లు పెడితే... తామెలా ముందుకు సాగుతామని కూడా వారు హరిబాబును అడిగారట. దీంతో మిన్నకుండిపోయిన హరిబాబు కూడా చంద్రబాబు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే.. జెండాలు కండువాలు లేకుండా బీజేపీ ప్రచారం చేసేది లేదు కాబట్టి బయటకు ఆ పార్టీ టీడీపీకి మద్దతు ప్రకటించినా... ప్రచార బరిలో మాత్రం ఆ పార్టీ కనిపించబోదన్నమాట.