జనానికి అమరావతి తప్ప వేరే దిక్కు లేదా బాబూ!

Fri Aug 11 2017 10:40:32 GMT+0530 (IST)

మంగళగిరికి ఎయిమ్స్ వైద్య సంస్థ రాబోతోంది. అమరావతిలో తుళ్లూరు వద్ద బీఆర్ ఎస్ మెడిసిటీ నిర్మాణానికి చంద్రబాబునాయుడు గురువారం శంకుస్థాపనచేశారు. దాదాపు 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో దుబాయ్ లో పేరుమోసిన బీఆర్ ఎస్ షెట్టి సంస్థ ఈ మెడిసిటీని నిర్మించనున్నట్లు వెల్లడించారు. కేవలం ఈ సంస్థలు మాత్రమే కాదని.. అమరావతి లో ఇంకా పలు వైద్య కళాశాలలు - కార్పొరేట్ వైద్య హంగులు ఏర్పాటు కాబోతున్నాయని చంద్రబాబునాయుడు చాలా ఆడంబరంగా ప్రకటించారు. వినడానికి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆయన చెబుతున్నట్లే అమరావతిని ఓ అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రయత్నాలు అన్నీ కూడా బాగానే ఉపయోగపడవచ్చు.

కానీ ఏపీ రాష్ట్రంలోని జనం పరిస్థితి ఏమిటి? అటు శ్రీకాకుళం నుంచి గానీ.. ఇటు చిత్తూరు నుంచి గానీ.. జనాలకు పెద్దపెద్ద రోగాలు వస్తే.. ఈసురోమంటూ వారు లగెత్తుకుని అమరావతికి రావాల్సిందేనా? అత్యున్నత స్థాయి వైద్యసదుపాయాలు రాష్ట్రానికి తరలివస్తున్నప్పుడు.. వాటన్నింటికీ.. రాజధానిలో ఒకేచోట స్థలాలు ఇచ్చేయకుండా.. రాష్ట్రమంతా వాటిని విస్తరిస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది కదా...! ఎంతో అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబునాయుడు ఇంత చిన్న అంశాన్ని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనే బాధ ప్రజల్లో కలుగుతోంది.

చంద్రబాబునాయుడు.. తాను తలచిన అభివృద్ధినంతా ఈ తరహాలో ఒకే చోట కేంద్రీకరించేసి.. తర్వాత అనేక వివాదాలకు అసంతృప్తులకు బీజం వేయడం అనేది ఇవాళ తొలి సంగతి కాదు. గతంలో తాను తొమ్మిదేళ్లు సీఎంగా వెలగబెట్టిన రోజుల్లో చేయదగిన ప్రతి అభివృద్ధి పనిని ఆయన హైదరాబాదులోనే కేంద్రీకృతం చేశారు. తర్వాతి రోజుల్లో తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకోవడానికి తెలంగాణ రాష్ట్రం విడిపోవడాన్ని మిగిలిన సీమాంధ్ర ప్రాంతం వారంతా వ్యతిరేకించడానికి కేవలం హైదరాబాదు నగరం ఒక్కటే కారణం అయింది. రాష్ట్రంలో ఎక్కడా లేని అభివృద్ధి మొత్తం చంద్రబాబు అప్పట్లో హైదరాబాదుకు మాత్రమే పరిమితం చేశారు. ఆయన మీద సీమాంధ్రుల్లో ఆ మేరకు చాలా కడుపుమంటే ఉండేది.

చంద్రబాబునాయుడు ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. రాష్ట్రానికి ఏ పెట్టుబడి వచ్చినా ఏ సంస్థ వచ్చినా ముందుగా దానిని అమరావతికి తీసుకువెళుతూ.. మొత్తం అక్కడే కేంద్రీకరిస్తున్నారని.. ఈ ప్రయోగం మళ్లీ వికటించక తప్పదని.. మళ్లీ రాష్ట్రంలో వేర్పాటు వాద ఉద్యమాలు ఊపిరిపోసుకున్నా ఆశ్చర్యం లేదని ప్రజలు అనుకుంటున్నారు.