Begin typing your search above and press return to search.

తెలివి అంటే మోసాలు చేయడమేనా బాబూ?

By:  Tupaki Desk   |   21 July 2017 4:21 AM GMT
తెలివి అంటే మోసాలు చేయడమేనా బాబూ?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తాను చాలా తెలివైన వాడినని విపరీతమైన నమ్మకం. నిజానికి ఇలాంటి నమ్మకం చాలా మందికి ఉంటుంది. అయితే చంద్రబాబునాయుడు ఒక అడుగు ముందుకేసి.. తానొక్కడినే తెలివైన వాడినని, తాను తప్ప మిగిలిన వారంతా తెలివితక్కువ వారు అని కూడా అనుకుంటూ ఉంటారు. ఆ తెలివి తక్కువ తనాన్ని రాజకీయ ప్రత్యర్థులకు మాత్రమే కాదు.. తనకు అధికారం అప్పగించిన దేవుళ్లలాంటి ప్రజలకు - కులాలకు - సామాజిక వర్గాలకు కూడా ఆపాదించేసి గేలిచేయడం... ఆయనకు మాత్రమే తెలిసిన విద్య. గురువారం నాడు ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఒక కులం మనోభావాల్ని దెబ్బతీసేలా, వారిని చులకన చేసేలా, హేళనా పూర్వకంగా ‘వాళ్లకు తెలివి ఉండదు’ అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.

చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో గురువారం పర్యటించారు. అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఎస్టీలు అడవుల్లో ఉంటారు.. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు.. వారికి తెలివి ఉండదు.. ’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం గొడవకు కారణం అవుతున్నాయి. చంద్రబాబుకు ఎస్టీలు అంటే చులకన భావం ఉండొచ్చు గాక.. అయితే వారిని ఇలా బహిరంగ వేదికల మీదనుంచి అవమానిస్తే ఎలా అని పలువురు ఆవేదన చెందుతున్నారు.

ఒకవైపు చంద్రబాబు కులాలను రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం లాంటి డైలాగులతో... కనీసం తమ డిమాండ్లు వినిపించడానికి ఉద్యమ ప్రణాళికతో ఉన్న కాపులు - మాదిగలు ఇతర సామాజిక వర్గాలను బెదిరిస్తూ ఉంటారు. తన ప్రభుత్వ పోలీసు బలగాలను వారి మీదకు ఉసిగొలుపుతూ ఉంటారు. మరో వైపు తాను మాత్రం.. కులాలను హేళన చేస్తూ.. ఆవేదనకు గురిచేస్తూ తెలివిలేని వాళ్లు అంటూ గర్హనీయమైన వ్యాఖ్యలు చేస్తూ.. అవమానిస్తూ ఉంటారు.

అయినా, ఇంతకీ ఆయన దృష్టిలో తెలివితేటలంటే.. మోసాలు మాత్రమే ఏమో అని కొందరు రిటార్టులు ఇస్తున్నారు. తనకు తెలిసినన్ని మోసాలు - వక్రనీతులు తెలియని వాళ్లు గనుక.. ఎస్టీలు ఏకంగా తెలివిలేని వాళ్లు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసి ఉంటారని ఎద్దేవా చేస్తున్నారు. ఎస్టీల పట్ల తన వ్యాఖ్యలు రేకెత్తిస్తున్న దుమారం నుంచి బయటపడడానికి ఆయన ఏం మాయమాటలు చెబుతారో చూడాలి.