Begin typing your search above and press return to search.

వాళ్ల వాదన కూడా చంద్రబాబే వినిపిస్తున్నారే!

By:  Tupaki Desk   |   24 April 2019 4:25 AM GMT
వాళ్ల వాదన కూడా చంద్రబాబే వినిపిస్తున్నారే!
X
కేరళ - యూపీల్లో కూడా ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని అంటున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. మహారాష్ట్రకు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పాత మాటలే చెప్పారు. ఏపీ పోలింగ్ రోజున చెప్పిన మాటలనే మళ్లీ మళ్లీ చెబుతున్న చంద్రబాబు నాయుడు ఈ సారి కేరళ - యూపీలో పోలింగ్ తీరు మీద కూడా స్పందించేశారు.

అక్కడ కూడా ఈవీఎంల మొరాయింపు జరిగిందని, మళ్లీ అధికారులు రంగంలోకి దిగి ఈవీఎంలను మార్చారని.. అదంతా కుట్ర అని, వ్యూహాత్మకం అని అలా ఈవీఎంలలో డేటాను బీజేపీకి అనుకూలంగా మార్చేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించేశారు. అయితే బాబు ఆరోపణలు లాజికులకు అందవు. ఏవో కొన్ని ఈవీఎంలను మార్చిననంత మాత్రం మొత్తం ఫలితాలు మారిపోతాయని బాబు వాదించడం అసంబద్ధంగా ఉంది. యాభై వేల ఈవీఎంలు వాడిన రాష్ట్రంలో మూడు వందల ఈవీఎంలను మార్చేసిన వైనం పెద్ద కుట్ర అని బాబు అనడం లాజిక్ లకు అందడం లేదు. అందుకే బాబు వాదనకు ఎక్కడా పెద్ద విలువ దక్కడం లేదు. ఆఖరికి సొంత రాష్ట్రంతో సహా!

ఇక కేరళ - యూపీల తరఫున కూడా చంద్రబాబు నాయుడే మాట్లాడేస్తూ ఉండటం మరింత విడ్డూరంగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. అక్కడా పార్టీలున్నాయి. అక్కడా బీజేపీ వ్యతిరేక పక్షాలున్నాయి. అయితే వారెవరూ మాట్లాడలేదు. కేవలం అఖిలేష్ యాదవ్ మాత్రం ఒక మాట అన్నారు. ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటు పడుతోందంటూ ఒక అసంబద్ధమైన విమర్శ చేశారాయన. ఆ మాటను ప్రజలు చెబితే విశ్వసించాలి కానీ, రాజకీయ నేతలు చెబితే విశ్వసించాల్సిన అవసరం లేదు.

ఈ సారి వీవీ ప్యాట్లు వచ్చాయి - ప్రజలు తాము ఎవరికి ఓటేశారో స్పష్టంగా తెలుసుకున్నారు. మూడు సెకన్ల వ్యవధి పాటు వారికి తమ ఓటు ఎటు పడిందనేది కనిపించింది. అయితే పదకొండు సెకన్లపాటు కనిపించాలనేది చంద్రబాబు నాయుడి డిమాండ్! కనిపించడం నిజం అయ్యాకా.. సరి చూసుకోవడానికి మూడు సెకన్లు చాలవా? ఏదో ఒకటి వాదించాలని కాబట్టి వాదించినట్టుగా బాబు మాటలున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ఈవీఎంల విషయంలో కేరళ రాజకీయ నేతలు ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. ఈవీఎంలతో మోసం జరిగిందనో, మరోటనో వారు మాట్లాడలేదు. అయితే వారి తరఫున కూడా చంద్రబాబు నాయుడే మాట్లాడేశారు. కేరళలో పోలింగ్ తీరు మీద కూడా చంద్రబాబే తీర్పు ఇచ్చేశారు!