Begin typing your search above and press return to search.

ఉగాది త‌ర్వాత బాబు గుడ్ న్యూస్ చెప్తార‌ట‌

By:  Tupaki Desk   |   22 March 2017 11:15 AM GMT
ఉగాది త‌ర్వాత బాబు గుడ్ న్యూస్ చెప్తార‌ట‌
X
ఏపీలో ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ స్టాప్ పెట్ట‌నున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డం, త‌న త‌న‌యుడు నారా లోకేష్‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాల్సిన స‌మయం దాటిపోతుండ‌టంతో బాబు విస్త‌ర‌ణ‌ ముహూర్తం నిర్ణయించారని అంటున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే నెల 6న విస్తరణ ఉండవచ్చని తెలుస్తోంది. ఆరోజు దశమి - పైగా గురువారం కూడా కావడంతో ముహూర్త బలం బాగుంటుందని పండితులు కూడా సూచించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ కోసం 6 - 7 - 8 తేదీలను పరిశీలించారు. వీటిలో 6వ తేదీనే బాగుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఉగాది రోజు విస్తరణ చేపడితే బాగుంటుందనే సూచన వచ్చినప్పటికీ చంద్రబాబు దాన్ని తిరస్కరించినట్లు తెలిసింది. పండుగరోజు పదవులు కోల్పోయిన వారిని బాధపెట్టడం మంచిదికాదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గతంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు దసరా రోజు చేసిన మంత్రివర్గ విస్తరణలో పదవులు కోల్పోయిన తలసాని శ్రీనివాసయాదవ్ వంటి నేతలు పండుగరోజు తమను బాధపెట్టారని లేఖ రాసిన విషయం తెలిసిందే.

కాగా, కొత్త కేబినెట్‌లో నలుగురు రెడ్లకు, మైనారిటీలకు చెందిన ఒకరికికి స్థానం కల్పించవచ్చని చెబుతున్నారు. రెడ్డి కోటాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి - మాగుంట శ్రీనివాసులురెడ్డి - అమర్‌ నాథ్‌ రెడ్డి - భూమా అఖిలప్రియ పేర్లు వినిపిస్తుండగా, మైనారిటీ కోటాలో సీనియర్ నేత - బాబుకు నమ్మినబంటైన ఎంఏ షరీఫ్ పేరు వినిపిస్తోంది. ఇప్పటివరకూ మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వని విషయం తెలిసిందే. రావెల కిషోర్‌ బాబును తొలగించడం ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్థానంలో విశాఖ జిల్లాకు చెందిన అనితకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. అదే సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును తప్పిస్తారంటున్నారు. ఆయన స్థానంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు చోటు దక్కవచ్చని తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు - కెఇ కృష్ణమూర్తి - అయ్యన్నపాత్రుడు శాఖలు మార్చవచ్చని కూడా సమాచారం. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళావెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకుని, మంత్రి మృణాళినిని తప్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అచ్చన్నాయుడును తప్పిస్తారనే ప్రచారమూ జరుగుతోంది.

ఇక కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ శెట్టిబలిజ వర్గానికి చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉన్న నిమ్మకాయల చినరాజప్పకు పార్టీ అధ్యక్ష పదవి అప్పగించి, ఆయన స్థానాన్ని జ్యోతుల నెహ్రూతో భర్తీ చేస్తారని చెబుతున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర కొనసాగడం కూడా అనుమానమేనంటున్నారు. మంత్రి నారాయణకు సీఆర్‌డిఏ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో చాలాకాలం నుంచీ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. మంత్రివర్గంలో పీతల సుజాత కొనసాగింపుపైనా తర్జనభర్జనలు జరుగుతున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తంగా వ‌చ్చే నెల‌లో ఇన్నాళ్లుగా ఉన్న ఉత్కంఠ‌ను బాబు తెర‌దించుతార‌నేది ఖాయం చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/