Begin typing your search above and press return to search.

బాబు ఢిల్లీ దీక్ష‌!...కాస్ట్లీనే కాదు ల‌గ్జ‌రీ కూడా!

By:  Tupaki Desk   |   10 Feb 2019 6:26 PM GMT
బాబు ఢిల్లీ దీక్ష‌!...కాస్ట్లీనే కాదు ల‌గ్జ‌రీ కూడా!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై ఇప్ప‌టికే ధ‌ర్మ పోరాట దీక్ష‌లంటూ ప్ర‌జా ధ‌నాన్ని మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేస్తున్న టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు.. ఇప్పుడు త‌న ఢిల్లీ దీక్ష కోసం కోట్ల‌కు కోట్లు వెచ్చించేస్తున్నారు. ఈ విష‌యం ఏ విప‌క్ష‌మో, వైరి వ‌ర్గ‌మో చేస్తున్న ఆరోప‌ణ ఎంత‌మాత్రం కాదు... సాక్షాత్తు జాతీయ మీడియా ప‌క్కా ఆధారాల‌తో చేస్తున్న ఆరోప‌ణే ఇది. నేటి ఉద‌యం ఢిల్లీ వేదిక‌గా దీక్షకు దిగ‌నున్న చంద్ర‌బాబు త‌న పార్టీ శ్రేణుల‌ను ఇప్ప‌టికే హ‌స్తిన‌కు చేర‌వేశారు. ఇందుకోసం ఏకంగా రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను బుక్ చేసిన బాబు స‌ర్కారు... అందుకోసం అక్ష‌రాలా రూ.1,12,16,465(అక్ష‌రాలా ఒక కోటి 12 ల‌క్ష‌ల 16 వేల నాలుగు వంద‌ల ఆర‌వై ఐదు రూపాయ‌లు)ల‌ను భార‌తీయ రైల్వేకు చెల్లించేసింది. ఇక్క‌డితోనే అంతా అయిపోయింద‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే.

ఎందుకంటే... బాబు దీక్ష‌ల‌కు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీ చేరిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు రేపు ఢిల్లీలో అడుగుపెట్ట‌బోయే మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ప‌లు కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు - పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మెంబ‌ర్ల బ‌స కోసం ఏకంగా ల‌గ్జ‌రీ హోట‌ల్ రూంల‌ను బుక్ చేసి పారేశారు. ఇందుకోసం కూడా బాబు స‌ర్కారు భారీగానే ప్ర‌జా ధ‌నాన్ని వెచ్చిస్తోంది. ప్ర‌త్యేక రైళ్ల కోసం కోటి రూపాయ‌ల‌కు పైగా వెచ్చించిన బాబు ప్ర‌భుత్వం... ల‌గ్జ‌రీ వ‌స‌తుల కోసం రూ.60 ల‌క్ష‌ల మొత్తాన్ని ఖర్చు చేస్తోంది. ఈ ల‌గ్జ‌రీ వ‌స‌తుల్లో కూడా నేత‌ల స్థాయిని బ‌ట్టి హోట‌ల్ రూంల‌ను బుక్ చేశారు. పార్టీ ప‌రంగా బాబు ఢిల్లీ దీక్ష‌కు త‌ర‌లివెలళుతున్న నేత‌లెంత మంది అన్న విష‌యానికి వ‌స్తే... 26 మంది మంత్రులు - 127 మంది ఎమ్మెల్యేలు - 41 మంది ఎమ్మెల్సీలు - 15 మంది ఆయా కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు - 150 మంది జ‌న‌ర‌ల్ బాడీ మెంబ‌ర్లు - 2 వేల మంది పార్టీ మ‌ద్ద‌తుదారులు... మొత్తంగా ఈ లెక్క 2,500గా తేలింది.

వీరంద‌రికీ వారి వారి స్థాయిల‌ను బ‌ట్టి ల‌గ్జ‌రీ అకామిడేష‌న్ ఇప్ప‌టికే రెడీ అయిపోయింద‌ట‌. ఈ ల‌గ్జ‌రీ బ‌స‌లో మంత్రులకు హోట‌ల్ రాయ‌ల్ ప్లాజాలో 13 గ‌దులు - 127 మంది ఎమ్మెల్యేల‌కు హోట‌ల్ సూర్యాలో 84 గ‌దులు - ఎమ్మెల్సీలు - కార్పొరేష‌న్ల చైర్మ‌న్ల‌కు వైఎంసీఏలో 28 గ‌దులు - పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మెంబ‌ర్ల‌కు హోట‌ల్ స‌ద‌ర‌న్ లో 75 గ‌దులు - పార్టీ మ‌ద్ద‌తుదారుల‌కు ఓయో ప‌హార్ గంజ్ లో 1000 గ‌దులు బుక్ చేసేశారు. వీటికి అద‌నంగా కుర్జాన్ హోట‌ల్‌ లో 150 మందికి అద‌నంగా వ‌స‌తి ఏర్పాటు చేశారు. ఈ మొత్తం విలువే రూ.58,53,837గా తేలింది. ఇక దీనికి మ‌రింత అద‌నంగా ఏపీ భ‌వ‌న్ లో 20 గ‌దులు - కేర‌ళ భ‌వ‌న్ లో 10 గ‌దుల‌ను కూడా అడ్వాన్స్ గా బుక్ చేసి పెట్టారు. బాబు ఒక్క‌రోజు దీక్ష చేస్తుంటే... ఈ హోట‌ళ్ల బుకింగ్ లు మాత్రం రెండు రోజుల‌కు - మూడు రోజుల‌కు కూడా బుక్ చేశారు.

అయినా కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రిపై నిర‌స‌న తెలిపేందుకు ఢిల్లీ వెళుతున్న నేత‌లు - పార్టీ మ‌ద్ద‌తుదారుల‌కు ల‌గ్జ‌రీ వ‌స‌తులు ఎందుకో బాబు సర్కారుకే తెలియాలి. ఇలా త‌న పార్టీ ఇమేజీని పెంచుకోవ‌డానికి దీక్ష‌ల పేరిట ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్న కార‌ణంగానే బాబు దీక్ష‌ల‌పై ఇటు ఏపీలోని విప‌క్షం వైసీపీ - అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ త‌మ‌దైన శైలి విమ‌ర్శ‌లు సంధిస్తున్నాయి. చివ‌ర‌కు నిన్న‌టి ఏపీ టూర్‌లోనూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా బాబు ఢిల్లీ దీక్ష‌పై త‌న‌దైన సెటైర్లు వేశారు. కోట్లాది ప్ర‌జా ధనాన్ని వెచ్చించి దీక్ష చేస్తున్న చంద్ర‌బాబు.. కేవ‌లం ఫొటోల‌కు ఫోజులివ్వ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకున్నార‌ని మోదీ సెటైర్ వేశారు. అయినా ఎవ‌రెన్ని ర‌కాలుగా విమ‌ర్శ‌లు సంధిస్తున్నా... బాబు త‌న దుబారా ఖ‌ర్చు మానుకోరు కదా.