Begin typing your search above and press return to search.

ఇదిగో... బాబు గారి అవకాశవాదం...

By:  Tupaki Desk   |   20 Sep 2018 6:22 AM GMT
ఇదిగో... బాబు గారి అవకాశవాదం...
X
జాతీయ - రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజకీయాలు తెలియని వారుండరు. ఆయన వ్యూహ ప్రతివ్యూహాలకు - రాజకీయ చతురత అనేక మంది రాజకీయ నాయకులకు తెలిసిందే. తన పదవి - అధికారం కోసం చంద్రబాబు నాయుడ్ని మించిన వారు లేరని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. అందుకు అనుగుణంగానే ఆయన చర్యలు కూడా ఉంటాయని రాజకీయ పండితులు అంటారు. తన మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంతో అలిగి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కె.చంద్రశేఖర రావు పట్ల చంద్రబాబు నాయుడికి ఆగర్భ శత్రుత్వం ఉంది. పైగా పోరాడి తెలంగాణ సాధించుకున్న తీరుపై కూడా చంద్రబాబు నాయడు ఆగ్రహంగానే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం - తెలంగాణ సాధన - ఆపై ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం, ఇవన్నీ తమపై కక్షతోనే చంద్రశేఖర రావు చేసారనే నారావారి ఆలోచనలు.

కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ సాధించడం కంటే రాజకీయంగా తనను సాధించడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారని చంద్రబాబు నాయుడు తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరి చంద్రుల మధ్య పూడ్చలేని అగాధం ఉందని రాజకీయ పార్టీలలోను ప్రజలలోను కూడా ఓ అభిప్రాయం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన ఓ ప్రకటన ఆయన రాజకీయ ఎత్తుగడకు నిదర్శనంగా చెబుతున్నారు. బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్టాడిన చంద్రబాబు నాయుడు తాను తెలంగాణ రాష్ట్ర సమితితో కలసి పనిచేద్దామనుకున్నానని - దీనికి భారతీయ జనతా పార్టీ అడ్డుపుల్ల వేసిందని అన్నారు. ఆగర్భ శత్రువులా వ్యవహరించిన ఇద్దరు చంద్రులు కలవడం జరిగే పని కాదని - ఈ ప్రకటన చంద్రబాబు నాయుడి రాజకీయ ఎత్తుగడలోని భాగమేనని విశ్లేషకులు అంటున్నారు. తనను ఇబ్బందుల పాలు చేసిన భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి - ఇరుకున పెట్టడానికి చంద్రబాబు ఈ ప్రకటన చేసారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఒక వరలో రెండు కత్తులు ఇమడనట్టే - ఒకే వేదికపై ఇద్దరు చంద్రులు ఇమడరని అంటున్నారు. అయితే ఈ విషయం చంద్రబాబుకు తెలిసిన తన రాజకీయ లబ్ది కోసం ఈ ప్రకటన చేసారని ఓ సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ చతురతకు - ఆయన అవకాశ వాదానికి ఈ ప్రకటన తార్కానమని విశ్లేషకులు అంటున్నారు.