Begin typing your search above and press return to search.

ఫస్టు, లాస్టు రెండూ ఉత్తరాంధ్రే

By:  Tupaki Desk   |   25 May 2016 8:51 AM GMT
ఫస్టు, లాస్టు రెండూ ఉత్తరాంధ్రే
X
ఉత్తరాంధ్ర జిల్లాలంటే వెనుకబడిన ప్రాంతాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా శ్రీకాకుళం - విజయనగరం జిల్లాలు రెండూ పూర్తిగా వెనుకబడ్డాయి. అయితే... విశాఖ జిల్లాకు వచ్చేసరికి ఆ జిల్లాలో ఎక్కువ భాగం అటవీ ప్రాంతం అయి వెనుకబడినప్పటికీ వైజాగ్ సిటీ కారణంగా కొంత ప్రగతి కనిపిస్తుంది. ఆ కారణంగానే నవ్యాంధ్ర తలసరి ఆదాయాల లెక్కతీస్తే విచిత్రంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే ఫస్టు - లాస్టు స్థానాలు కనిపించాయి.

ఏపీ ఆర్థిక అభివృద్ధి నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. విజయవాడ లో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో భాగంగా చంద్రబాబు ఈ నివేదికను రిలీజ్ చేశారు. రాష్ట్ర తలసరి ఆదాయాల్లో ఉన్న తీవ్ర వ్యత్యాసాలను ఆయన అక్కడ చర్చకు పెట్టారు. నవ్యాంధ్ర తలసరి ఆదాయం రూ. 1,07,532 గా నమోదైంది. అదే సమయంలో తలసరి ఆదాయంలో టాప్ - అట్టడుగు స్థానాల్లో నిలిచిన రెండు జిల్లాలు కూడా ఉత్తరాంధ్రకు చెందినవే కావడం గమనార్హం. రూ.1,40,648 తలసరి ఆదాయంతో విశాఖ జిల్లా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిస్తే... విశాఖకు సమీపంలోని శ్రీకాకుళం జిల్లా రూ.74,638తో చివరి స్థానంలో ఉంది. రాష్ట్ర పాలనకు, రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్న విజయవాడ ఉన్న కృష్ణా జిల్లా ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా తలసరి ఆదాయం రూ.1,40,593.. పశ్చిమ గోదావరి జిల్లా రూ.1,21,724తో మూడో స్థానంలో నిలిచింది.

విశాఖ జిల్లా ఉత్తరాంధ్రలోనే ఉన్నప్పటికీ భారీ స్థాయిలో పరిశ్రమలు ఉండడం.. దానిపై ఆధారపడేవారి సంఖ్య ఎక్కువగా ఉండడం.. ప్రభుత్వ రంగ సంస్థలు - సాఫ్టువేర్ - ఇతర సేవారంగ సంస్థలు ఉండడంతో నగరం పరంగా విశాఖ నవ్యాంధ్రలోనే టాప్ ప్లేస్ గా నిలుస్తోంది. ఆ కారణంగా అక్కడ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. విశాఖ నగర ప్రభావంతో మొత్తం విశాఖ జిల్లా సగటు తలసరి ఆదాయం కూడా పెరిగింది. దాంతో నవ్యాంధ్రలో తలసరి ఆదాయంలో విశాఖ జిల్లా మొదటి స్థానంలో నిలవగలిగింది. ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికొస్తే సమైక్య రాష్ట్రంలోనూ ఆ జిల్లాది ఎప్పుడూ చివరి స్థానమో లేదంటో.. చివరి నుంచి రెండో స్థానమో ఉండేది. నవ్యాంధ్రలోనూ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా అట్టడుగునే మిగిలిపోయింది. రెండు జీవ నదులున్నా సరైన ప్రాజెక్టులు లేకపోవడం.. చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశ్రమలు లేకపోవడం వంటి కారణాలతో ఆ జిల్లా తలసరి ఆదాయంలో అధమ స్థానంలో ఉంది.