'మేం నమ్మం అంతే..' చంద్రబాబు దోస్తులంతా ఒకటే పాట!

Tue May 21 2019 09:51:16 GMT+0530 (IST)

ఇవే ఎగ్జిట్ పోల్స్ వాళ్లకు అనుకూలంగా వచ్చి ఉంటే వాళ్లు ఎలా స్పందించే వారో వేరే వివరించనక్కర్లేదు. ఎగ్జిట్ పోల్స్ లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని తేలి ఉంటే.. వీళ్లంతా ఇప్పటికే సంబరాలు మొదలుపెట్టే వాళ్లు. సోషల్ మీడియాలో స్పందించేవారు - మీడియా ముందుకు వచ్చి తాము గెలవబోతున్నట్టుగా.. మోడీ మీద విరుచుకుపడే వాళ్లు. ఎగ్జిట్ పోల్స్ లో అనుకూలత వ్యక్తం అయి ఉన్నా వీళ్లందరి సెలబ్రేషన్స్ పతాక స్థాయికి చేరి ఉండేవి.అయితే వీరికి వ్యతిరేకంగా రావడంతో ఎగ్జిట్ పోల్స్ నమ్మరానివిగా మారాయి. వీళ్లంతా ఎగ్జిట్ పోల్స్ మీద ఒంటి కాలితో లేస్తున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ - టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ - కాంగ్రెస్ నేత - మాజీ మంత్రి శశిథరూర్.. వీళ్లంతా ఎగ్జిట్ పోల్స్ ను తాము నమ్మడం లేదని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాటే చెబుతున్న సంగతి తెలిసిందే.

ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడిని పట్టలేదని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అదే పాటనే ఆయన సన్నిహిత పార్టీల నేతలంతా చెప్పుకొస్తున్నారు! తాము ఎగ్జిట్ పోల్స్ ను నమ్మే ప్రసక్తి లేదని చెబుతున్నారు. అయినా వీటిని ఎవరు నమ్మినా - నమ్మకపోయినా అదేం పెద్ద ఇష్యూ కాదేమో.

అసలు ఫలితాలు రావడానికి మరెన్నో రోజుల సమయం లేదు. కేవలం  కొన్ని గంటల్లోనే ఎన్నికల కౌంటింగ్ మొదలు కానుంది కాబట్టి.. ఎగ్జిట్ పోల్స్ ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరికీ వచ్చే నష్టం లేకపోవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.