Begin typing your search above and press return to search.

రాజ్యసభ పోల్స్: ‘చంద్రుల’ చుట్టూ తిరగనున్న గ్రహాలు!!

By:  Tupaki Desk   |   23 Feb 2018 4:43 PM GMT
రాజ్యసభ పోల్స్: ‘చంద్రుల’ చుట్టూ తిరగనున్న గ్రహాలు!!
X
రాజ్యసభ ఎన్నికలకు గంట మోగింది. దేశవ్యాప్తంగా 16 రాష్ట్ర్రాల్లో 58 సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటి ఎన్నిక కోసం వచ్చేనెల 5 వతేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. 23వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మనకు సంబంధించినంత వరకు తెలంగాణలో 3 - ఏపీలో 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

ఇప్పుడిక రెండు రాష్ట్రాల్లోనూ అన్ని అంశాలను వెనక్కు నెడుతూ.. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు తెరమీదికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పదవులను ఆశిస్తున్న నాయకులందరూ ఇప్పుడు ఇద్దరు చంద్రుల చుట్టూ పరిభ్రమించే వాతావరణం ఉంది. తెలంగాణలో తెరాస కు విజయాలు ఏకపక్షంగా మూడు స్థానాలూ దక్కే అవకాశం ఉంది. ఆశావహులు ఎందరు ఉన్నప్పటికీ.. కేసీఆర్ నిర్ణయం మీద అలిగే వారు గానీ - దాన్ని ప్రశ్నించే వారు గానీ ఎవ్వరూ లేకపోవడంతో అక్కడంతా ఏకపక్షంగానే జరిగిపోతుంది.

ఏపీ విషయంలోనే ఈసారి రాజ్యసభ ఎన్నికలలో హైడ్రామా నడిచే అవకాశం కనిపిస్తోంది. సభలో ఉన్న బలాబలాలను బట్టి రెండు స్థానాలు తెలుగుదేశానికి ఖరారుగా దక్కుతాయి. అదే సమయంలో మూడో స్థానాన్ని దక్కించుకోవడానికి వైసీపీ వారికి కొన్ని ప్రధమ ప్రాధాన్య ఓట్లు తక్కువ అవుతాయి. ఇక్కడే రాజకీయ మంత్రాంగం నడపడానికి తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తున్నట్లుగా చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల కోసం తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి తెదేపా ప్రయత్నిస్తున్నదంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇదివరకే రాష్ట్రపతికి ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ - ఐపీఎస్ అధికారులతో రాజకీయ లాబీయింగ్ చేస్తున్నట్లుగా కూడా ఆరోపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం ఎన్ని వక్రమార్గాలు తొక్కుతుందనేది చర్చనీయాంశంగా ఉంది.

పదవుల విషయానికి వస్తే.. జయప్రకాశ్ నారాయణ్ కు ఒక ఎంపీ సీటు కేటాయించి - రాజ్యసభలో ఏపీ సమస్యలను గట్టిగా ప్రస్తావించగల నేతగా పంపాలనే ఉద్దేశం చంద్రబాబుకు ఉన్నట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. మరి రెండో సీటును ఆయన ఎవరికి కేటాయిస్తారనేది సందేహం. గతంలో ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఏపీనుంచి ఒక ఎంపీ సీటును భాజపా గెలిపించుకునేది. కానీ ఈసారి మైత్రి కి గండిపడ్డ సమయంలో.. వారికి అంత సీన్ ఉండకపోవచ్చునని కూడా పలువురు అనుకుంటున్నారు.