Begin typing your search above and press return to search.

చంద్రుళ్లు..ఎన్టీఆర్ లో ఈ యాంగిల్స్ తెలుసా?

By:  Tupaki Desk   |   27 Sep 2018 5:08 AM GMT
చంద్రుళ్లు..ఎన్టీఆర్ లో ఈ యాంగిల్స్ తెలుసా?
X
నిజ‌మే.. ఇప్పుడు ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చుకోవాల్సిన ప్ర‌త్యేక సంద‌ర్భం లేదు. కాకుంటే.. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లో ఎన్టీఆర్ కుమారుడు హ‌రికృష్ణను గుర్తుకు తెచ్చుకునే క్ర‌మంలో ఎన్టీఆర్ కు స‌న్నిహితంగా మెలిగిన పెద్ద మ‌నిషి త‌న అనుభ‌వాల్ని రాసుకొచ్చారు. ఏళ్ల‌కు.. ఏళ్లు ఎన్టీఆర్ తో త‌న‌కున్న అనుబంధంతో పాటు.. హ‌రికృష్ణ‌తో త‌న‌కున్న బంధం గురించి చెప్పుకొచ్చారు.

ఎవ‌రో చెప్పింది విని చెప్ప‌టం ఒక ఎత్తు. క‌ళ్ల ముందు చూసింది చూసిన‌ట్లు చెప్ప‌టం మ‌రో ఎత్తు. ఎన్టీఆర్ వ్య‌క్తిత్వం.. హ‌రికృష్ణ తీరు ఎలా ఉండేద‌న్న విష‌యాల్ని ఆయ‌న త‌న వ్యాసంలో రాసుకొచ్చారు. నిజానికి హ‌రికృష్ణ కంటే కూడా ఎన్టీఆర్ కు సంబంధించి ఆయ‌న చెప్పిన విష‌యాలు చూసిన‌ప్పుడు.. వ‌ర్త‌మానంలో ఇలాంటి అధినేత‌లు ఉంటే ఎంత బాగుండేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

ఇప్ప‌టి పాల‌కులు ఎంత‌సేప‌టికి ప్ర‌జాధ‌నాన్ని విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేయ‌ట‌మే కాదు.. అదేమీ పెద్ద విష‌యం కాద‌న్న‌ట్లుగా క‌నిపిస్తుంది. వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మాల‌కు వెళ్లేందుకు సైతం ప్రైవేటు చాఫ్ట‌ర్ల‌ను విచ్చ‌ల‌విడిగా వాడేయ‌టంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు చాలా మామూలు విష‌యం. నిజానికి తాము ఖ‌ర్చు చేసేది ప్ర‌జాధ‌నాన్ని అన్న భావ‌న వారికి అస్స‌లు క‌ల‌గ‌దు.

అలాంటి వేళ‌.. ప్ర‌జాధ‌నం విష‌యంలో ఎన్టీఆర్ ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటార‌న్నది ఉదాహ‌ర‌ణ‌తో స‌హా రాసుకొచ్చిన వైనం బాగుంది. ఇప్ప‌టిత‌రం క‌చ్ఛితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలివి. తాము అభిమానించి.. ఆరాధించే అధినేత‌లు త‌మ‌కు తోచిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించినా.. వెన‌కేసుకొచ్చే ఇప్ప‌టివారికి ఎన్టీఆర్ తీరు గురించి తెలిస్తే మంచిది.

ప్ర‌శ్నించే త‌త్త్వం ప్ర‌జ‌ల్లో ఎప్పుడు పోతుందో.. పాల‌కులు త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రినే చూడండి.. త‌నకు అనువుగా ఉండే ఇంటి కోసం ఆయ‌న ఏకంగా వంద కోట్ల‌కు పైగా భ‌వ‌నాన్ని క‌ట్టించార‌న్న ఆరోప‌ణ బ‌లంగా వినిపిస్తుంటుంది.

ఇక‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఖ‌ర్చు గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎన్ని రోజులు హైద‌రాబాద్‌ లో ఉంటామో తెలీని సంద‌ర్భంలోనూ స‌చివాల‌యం మ‌ర‌మ్మ‌త్తుల కోసం ఏకంగా రూ.20కోట్లు చేసిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. ఇలా ఖ‌ర్చులో ఒక‌రికి మించిన‌ట్లుగా ఒక‌రు ఉండే ఇద్ద‌రు తెలుగు ముఖ్య‌మంత్రులూ ఎన్టీఆర్ ను అమితంగా ఆరాధించేవారే కావ‌టం విశేషం.

తాము అభిమానించి.. ప్రేమించిన‌ట్లుగా చెప్పుకునే ఎన్టీఆర్ లోని మంచిని తీసుకోవ‌టంలో ఇద్ద‌రు చంద్రుళ్లు లైట్ తీసుకున్నార‌నే చెప్పాలి. ఇంత‌కీ.. ఎన్టీఆర్ ప్ర‌జాధ‌నం విష‌యంలో ఎంత జాగ‌రూక‌తో ఉండేవారు..? ఖ‌ర్చు విష‌యంలో ఆయ‌న తీరు ఏమిటి? అన్న‌ది చూస్తే..

+ విశాఖ జిల్లా అనకాపల్లి మీదుగా రామారావు పర్యటిస్తున్న సందర్భంలో ఊరి పొలిమేరలో జనం లేరనుకుని హరికృష్ణ వాహనాన్ని కొంత నిదానంగా నడుపుతున్నారు. అక్కడ దూరంగా ఓ శవానికి అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. ఊహించని విధంగా ఆ శవం చుట్టూ ఉన్న జనమంతా ఎన్టీఆర్ గారిని దూరం నుంచి చూసి - వాహనం వైపు పరుగులు తీశారు. ఈ దృశ్యాన్ని చూసిన రామారావు ‘హరీ - వాహనాన్ని వేగంగా నడుపు - చూడబోతే ఆ శవం కూడా నన్ను కలిసేందుకు లేచి పరుగున రావచ్చు’ అని ఛలోక్తి విసిరారు. హరికృష్ణ పలు సందర్భాల్లో ఈ ఘటనను గుర్తు చేసుకునేవారు.

+ రామారావు ప్రచార శైలి - తీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ - ఆయన జీవిత చరిత్ర లోనూ అత్యంత అపూర్వమైన - ఆకర్షణీయమైన ఘట్టం. ప్రతీరోజూ ప్రచారం ముగిసిన తర్వాత చైతన్య రథంలో కూర్చుని ఉపాహారం తీసుకుంటూ ఆరోజు యాత్రలోని విశేషాలు తెలుసుకుంటూ - మర్నాడు తన ప్రసంగంలో ఏ అంశాలపై స్పందించాలనే వివరాలను అడిగేవారు. ఈ అన్ని విషయాలతో పాటుగా ప్రతీ రోజూ తప్పనిసరిగా హరికృష్ణ బాగోగులు - ఆయన బృందానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాల్సిన ఏర్పాట్లపై సూచనలిచ్చేవారు. హరికృష్ణ విషయంలో రామారావుగారికి ఎంతో శ్రద్ధ ఉండేది. మూడురోజులకోమారు నా చేతికి కొంత డబ్బిచ్చి - ‘ఈ డబ్బును హరికిచ్చి రథానికి డీజిల్ పోయించమనండి’ అని చెప్పేవారు.

+ రామారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా - ఎప్పుడు ఎన్నికల ప్రచారానికి బయలుదేరినా - తన రథానికి సొంత డబ్బుతోనే డీజిల్ పోయించుకునేవారు. ఆ యాత్రల నిమిత్తం ప్రభుత్వ ధనాన్ని వెచ్చించేవారు కాదు. ఇతరులెవరినీ ఆయన కోసం డబ్బు ఖర్చుపెట్టనిచ్చేవారు కాదు. ఇటువంటి ఉదాత్త నాయకులను మనం వర్తమాన రాజకీయాల్లో ఊహించగలమా?

+ ‘ఆహ్వానం’ హోటల్ నిర్మాణంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ ఏకాంతంగా ఉన్నప్పుడు హరికృష్ణ వచ్చి - హోటల్ మూడవ అంతస్తు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 30 లక్షల రూపాయల అప్పు కావాలని రామారావుని సరదాగా అడిగారు. దానికి రామారావు అంతే సరదాగా స్పందిస్తూ - నన్ను పిలిచి - ‘రామచంద్రరావు - హరికి 30లక్షల రూపాయలు కావాలట - నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందీ - మీ దగ్గర ఉంటే మీరే హరికి ఇవ్వండి’ అని పెద్దగా నవ్వేశారు. వాస్తవానికి ఆహ్వానం హోటల్‌ ను అన్ని హంగులతో రామారావు నిర్మించారు.

+ ఒకసారి రామారావుగారు తన మారుతీ -800 కారు దిగుతున్నప్పుడు మోకాలికి - తలకు గట్టిగా దెబ్బ తగిలింది. వెంటనే ఏదైనా ఒక కారు డీలర్‌ ను పిలిపించమని నన్ను ఆదేశించారు. నాకు పరిచయమున్న బెంజ్ కంపెనీ డీలర్ - మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణను కొత్త మోడల్ కారును రామారావుగారి ఇంటికి తీసుకురమ్మన్నాను. ఆయన కొత్త కారును తీసుకువచ్చి - ‘ఇది చాలా లేటెస్ట్ మోడల్ కారు సార్.. మీరు తీసుకోండి - అది చూసి - ఒక్క వారంలో వెయ్యి మంది కొంటారు’ అని ఆయన రామారావుతో చెప్పారు.

+ ఆ కారులో నన్ను - రామకృష్ణను - డ్రైవర్ లక్ష్మణ్‌ ను కూర్చోబెట్టుకుని - బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 మీదుగా ఆయ‌నే స్వ‌యంగా.. స్పీడ్ గా ఆ కారు నడిపి చూశారు. ఇంటికి చేరుకున్న తర్వాత ‘కారు చాలా బాగుంది బ్రదర్- ధర ఎంత?’ అని అడిగారు. ఆరున్నర లక్షలనీ - అయినా ధరకేముంది లెండి - నచ్చితే తీసుకోండి అని రామకృష్ణ అన్నారు. ‘అమ్మో ఆరు లక్షల 50 వేల రూపాయలా’ అని రామారావు అనగానే - మొన్న హరికృష్ణ కూడా ఈ కారును తీసుకున్నారని రామకృష్ణ చెప్పారు. దీనికి రామారావుగారు స్పందిస్తూ ‘ఆయనకేం కొంటాడండీ - ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ కొడుకు - నేను మామూలు నందమూరి లక్ష్మయ్య చౌదరి కొడుకుని. నాకు, -ఆయనకూ పోలికేంటి’ అని నవ్వేశారు. చివరకు అంత ఖరీదైన కారును రామారావుగారు కొనలేదు.