Begin typing your search above and press return to search.

సానుభూతిపై కూడా చావు తెలివితేటలా?

By:  Tupaki Desk   |   9 Aug 2017 7:24 AM GMT
సానుభూతిపై కూడా చావు తెలివితేటలా?
X
‘అయ్యో పాపం అంటే ఆర్నెల్ల పాపం’ అనే సామెత ఉత్తినే పుట్టలేదు. చంద్రబాబునాయుడు లాంటి వారిని చూసే ఎవరో గానీ అలాంటి సామెతను పుట్టించి ఉంటారు. చంద్రబాబు తాజాగా మీడియా మిత్రులతో ముచ్చట్లలో షేర్ చేసుకున్న ఒక అంశాన్ని గమనిస్తే.. ఆయన మీద సానుభూతి చూపించినా కూడా ఆయన మాత్రం విషమే కక్కుతారని అర్థమవుతుంది.

ఎందుకంటే.. 2004 ఎన్నికలకు పూర్వం చంద్రబాబునాయుడు తిరుమలకు వెళుతుండగా.. అలిపిరి ఘాట్ రోడ్డు ప్రారంభం అయ్యేచోట నక్సలైట్లు మందుపాతర పేల్చి ఆయనను హత్య చేయడానికి ప్రయత్నించారు. చావు తప్పింది.. గాయపడిన చంద్రబాబు ప్రాణాల్తో బయటపడ్డారు.

ఏకంగా ముఖ్యమంత్రి మీద నక్సలైట్లు పాల్పడిన ఈ దాడిని గమనించి రాష్ట్రం మొత్తం విస్తుపోయింది. కెరీర్ ప్రారంభంలో చంద్రబాబుకు మిత్రుడు, ఆ సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ దాడితో తీవ్రంగా చలించిపోయారు. చంద్రబాబును తాను స్వయంగా పరామర్శించిన ఆయన ఈ దాడిని నిరసిస్తూ.. తిరుపతిలో పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. తాను ప్రతిపక్ష నేత అనే విషయాన్ని పక్కన పెట్టి, మానవతా వాదిగా.. సాటి నేతపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.

అయితే తాజాగా అప్పటి విషయాన్ని చంద్రబాబునాయుడు వక్రకోణంలో ప్రస్తావించడం విస్తుగొలుపుతోంది. తన మీద దాడి జరిగిన వెంటనే.. వైఎస్ రాజశేఖర రెడ్డి హుటాహుటిన తిరుపతికి వచ్చి ధర్నా చేశారని... కానీ అది తన మీద ప్రేమతో చేసిన ధర్నా కాదని, తన మీద దాడిని ప్లాన్ చేసిన గంగిరెడ్డిని కలవడానికి ధర్నా సాకు చూపి తిరుపతికి వచ్చారని చంద్రబాబునాయుడు చాలా చవకబారు ఆరోపణలు చేశారు. సానుభూతి చూపించేందుకు వెళ్లడాన్ని కూడా ఇన్నేళ్ల తర్వాత.. ఆ నాయకుడు కూడా మరణించిన తర్వాత.. ఆయన మీద నిందలుగా మార్చి ప్రచారం చేయడం అనేది చాలా లేకిగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ లెక్కన చంద్రబాబునాయుడు... ఎవ్వరి మరణం పట్లనైనా కన్నీళ్లు కార్చినా సరే.. అందులో ఆయనకు ఏదో ఒక స్కెచ్ ఉంటుందేమోనని, సహజమైన ఉద్వేగం ఉండదేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.