Begin typing your search above and press return to search.

చంద్రబాబు.. బీజేపీ వైపు తిరుగుతున్నాడా?

By:  Tupaki Desk   |   15 May 2019 6:37 AM GMT
చంద్రబాబు.. బీజేపీ వైపు తిరుగుతున్నాడా?
X
నిన్నటి వరకూ కూడా బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు చంద్రబాబు నాయుడు. కమలం పార్టీని బాబు ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని రకాలుగా తిట్టారో అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి నాలుగున్నరేళ్ల పాటు బీజేపీతో కలిసి కేంద్రంలో ప్రభుత్వంలో కొనసాగిన చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో బీజేపీని తిట్టారు. బీజేపీ మోసం చేసిందని, ఏపీని వంచించిందని బాబు ధ్వజమెత్తాడు. నాలుగున్నర సంవత్సరం పాటు బాబుకు ఆ విషయాలు అర్థం కాలేదు. ఎన్నికలు దగ్గర పడితే కానీ ఆ విషయాలు తెలియనట్టుగా బాబు వ్యవహరించాడు.

తన పాలనతోని వైఫల్యాలు అన్నింటినీ మోడీ మీద, బీజేపీ మీద తోసేసేందుకు చంద్రబాబు నాయుడు అలా వ్యవహరించాడని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ బీజేపీ వైపు మొగ్గు చూపుతూ ఉండటంతో బాబు తీరు మరోసారి చర్చనీయాంశంగా మారుతూ ఉంది. తన పార్టీ శ్రేణులతో జరిపిన సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 'మోడీ మీదే మన వ్యతిరేకత.. బీజేపీ మీద కాదు..' అని వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.

కేంద్రంలో మళ్లీ ఎన్డీయేకే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయంలో మెరుగు పడినా ప్రభుత్వాన్ని ఏర్పరిచేంత సీన్ ఉండదు అనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. పోలింగ్ దాదాపుగా పూర్తి అవుతున్న తరుణంలో అలాంటి కామెంట్లే వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మళ్లీ బీజేపీ వైపు తిరుగుతున్నట్టుగా ఉన్నాడని విశ్లేషకులు అంటున్నారు.

చంద్రబాబు నాయుడుకు యూటర్న్ లు అలవాటే అని, ఆయనకు ఇలాంటివి ఏమీ కొత్త కాదు అని, తన అవసరం మేరకు ఏమైనా మాట్లాడి, అవసరం తీరాకా మళ్లీ ఏమైనా చేయగల నేత ఆయన అనే అవకాశముద్ర బాబు మీద ఎప్పటి నుంచినో ఉంది. ఈ క్రమంలో మరోసారి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుంటున్నాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మోడీ మీద తమకు వ్యతిరేకత అని..బీజేపీ తరఫున వేరే వాళ్లు ఎవరైనా ప్రధాని అయితే తమకు అభ్యంతరం లేదని, నితిన్ గడ్కరీ ప్రధాని అయితే తాము మద్దతును ఇస్తామన్నట్టుగా చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలతో వ్యాఖ్యానించారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబును నమ్ముకుని నితిన్ గడ్కరీ కూడా అలర్ట్ అయిపోయాడని, అప్పుడే బాబుకు ఫోన్ కూడా చేశారని తెలుగుదేశం వాళ్లు ప్రచారం చేస్తూ ఉన్నారు!