Begin typing your search above and press return to search.

కారులో వెళుతూ ఆగి మరీ సాయం చేసిన బాబు

By:  Tupaki Desk   |   29 Nov 2015 4:41 AM GMT


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలానే మారినట్లు కనిపిస్తోంది. ఆయన గత వైఖరికి.. తాజాగా సీఎం పదవిని చేపట్టిన తర్వాత ఆయనలో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో మాదిరి అవిశ్రాంతంగా పని చేస్తున్నా.. వీలైనంతవరకూ నొప్పించకుండా వ్యవహరిస్తున్న వైనం కనిపిస్తుంటుంది. అదే సమయంలో.. తనకు ఏ మాత్రం అవకాశం వచ్చినా అపన్నహస్తం అందించేందుకు ఆయన వెనుకాడటం లేదు. కొన్ని సందర్భాల్లో ఆయన తన మెమరీ పవర్ ప్రదర్శించి పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

తాజాగా తన మెమరీ ఏ స్థాయిలో ఉంటుందో చూపించటమే కాదు.. సాయం కోసం వచ్చిన మహిళను గుర్తించి మరీ సాయం చేయటం పలువురిని ఆకట్టుకుంది. హైదరాబాద్ లోని ఏపీ సచివాలయానికి నెలల తర్వాత వచ్చిన చంద్రబాబు.. తిరిగి వెళ్లిపోతున్న సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవటానికి మాజీ జెడ్పీటీసీ గా పని చేసి.. నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతుల మీదుగా పురస్కారం పొందిన పారమ్మ అనే మహిళ గత కొద్దిరోజులుగా ప్రయత్నిస్తోంది.

విజయనగరం జిల్లాకు చెందిన ఈమె.. బాబును కలిసేందుకు ఎంతగానో ప్రయత్నించినా సాధ్యం కాని పరిస్థితి. ఇదిలా ఉండగా.. శనివారం హైదరాబాద్ లోని తన కార్యాలయం నుంచి కారులో వెళుతున్న చంద్రబాబు.. పారమ్మను చూసిన వెంటనే కారు ఆపారు. కిందకు దిగారు. తనను చూసి గుర్తు పట్టిన విషయాన్ని గమనించిన పారమ్మ.. వెంటనే ముఖ్యమంత్రి వాహనం వైపు వచ్చారు. ఆమెను పేరు పెట్టి పిలిచిన చంద్రబాబు.. ఇలా వచ్చారేమిటని ఆరా తీశారు.

అనారోగ్యంతో వైద్యం చేయించుకున్నానని.. అప్పుల పాలై పోయానని.. వైద్యం కోసం రూ.1.70లక్షలు ఖర్చు అయినట్లుగా తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. తనకు ఆర్థిక సాయం అందించాలంటూ వినతిపత్రాన్ని అందించారు. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆమెకు రూ.1.5లక్షలు సాయంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఏళ్లు గడిచిపోయిన తర్వాత కూడా ఒక మాజీ జెడ్పీటీసీని పేరుతో సహా చంద్రబాబు గుర్తు పెట్టుకోవటం గొప్పే కదూ..?