Begin typing your search above and press return to search.

సెన్సేషన్‌‌ గా చంద్రబాబు తమిళ ప్రసంగం

By:  Tupaki Desk   |   17 Dec 2018 9:35 AM GMT
సెన్సేషన్‌‌ గా చంద్రబాబు తమిళ ప్రసంగం
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు దక్షిణాది నేతల్లో చర్చనీయాంశంగా మారారు. చెన్నైలో డీఎంకే హెడ్ క్వార్టర్స్‌ లో కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ తమిళం లో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. డీఎంకే నేతలే కాకుండా ఆ కార్యక్రమానికి హాజరైన యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ- కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ- కేరళ సీఎం పినరయి విజయన్ కూడా చంద్రబాబు తమిళం లో మాట్లాడుతుంటే షాకయ్యారు.

చంద్రబాబు తన ప్రసంగం లో తమిళంలో ప్రసిద్ధ వాక్యాలు ఉటంకిస్తూ కరుణానిధి పై ప్రశంసలు కురిపించారు. ఓటమి అంటే ఏంటో తెలియకుండా వరుసగా 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక రాజకీయ నాయకుడు కరుణానిధి అని కొనియాడారు. 50 ఏళ్లు డీఎంకే అధినేతగా పనిచేసిన ఘనత కరుణానిధిదని బాబు గుర్తుచేశారు. కరుణానిధి తో ఆనాడు యునైట్ ఫ్రంట్‌ లో కలిసి పనిచేయడం ఎంతో అదృష్టమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీని భారీ మెజారిటీ తో గెలిపించాలని తమిళ ప్రజలను చంద్రబాబు కోరారు. స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. బీజేపీ పతనానికి తమిళనాడు లో డీఎంకే గెలుపు నాంది కావాలన్నారు. బీజేపీ పైనా విమర్శలు కురిపించారు.

సాధారణంగా నేతలు ఇతర రాష్ట్రాల్లో ప్రసంగించినప్పుడు అక్కడి భాష లో మాట్లాడిన సందర్భాలున్నాయి కానీ అవి ప్రజలను పలకరించడానికి ఒకట్రెండు మాటలు చెప్పడవ వరకే పరిమితం అవుతాయి. కానీ, చంద్రబాబు చాలాసేపు తమిళంలోనే మాట్లాడారు.

‘‘ఇండియా నాట్టిల్ మూత్త అరసియల్‌ వాది ముత్తువేల్ కరుణానిధి తిరు ఉరువ శిలయై చెన్నై మహానగరత్తిల్ తిరందు వైత్తుల్లోమ్. ఇప్పెరుమ్ విళావిల్ పంగుకొల్‌వదిల్ పెరుం మగచ్చి అడైగిరేన్’’ (తెలుగులో.... దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడు కరుణానిధి విగ్రహాన్ని చెన్నయ్ మహా పట్టణంలో ఆవిష్కరిస్తున్న గొప్ప కార్యక్రమంలో నేనూ ఉండడం సంతోషంగా ఉంది)) అని ఆయన అన్నప్పుడు అక్కడ చప్పట్లు, ఈలలు ప్రతిధ్వనించాయి.