ఏపీలో మెగా కాల్ సెంటర్

Fri Apr 21 2017 12:37:37 GMT+0530 (IST)

ఏపీ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ - అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా చేరడం లేదు. పైగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి... పథకాలలో లోపాలు ప్రభుత్వం దృష్టికి తేవడానికి సరైన సులభమైన వేదిక లేదు. మరోవైపు ఫిర్యాదులు ఇస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి అధికారులు కానీ పాలకులు కానీ వినే పరిస్థితి కనిపించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యల పరిష్కారం - అభిప్రాయ సేకరణ కోసం అత్యాధునిక కాల్ సెంటర్ వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం కైజాలా యాప్ లో కనెక్ట్ యువర్ సీఎం అనే సదుపాయం కల్పించారు.  తాజాగా మరో కొత్త స్టెప్ వేశారు. మెగా కాల్ సెంటర్ పేరుతో రోజుకు 12 గంటలు సేవలందించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
    
మొత్తం 28 శాఖలను ఈ మెగా కాల్ సెంటర్ లో ఇంటర్లింక్ చేస్తున్నారు. ఆయా శాఖలను ఈ కాల్ సెంటర్ తో అనుసంధానం చేశారు. ప్రజల నుంచి ఏదైనా అంశంపై ఫిర్యాదు రాగానే అది సంబంధిత శాఖకు బదిలీ చేస్తారు. దాన్ని పరిశీలించి అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారు. అదే విధంగా ఇతర మార్గాల్లో సేకరించిన మొబైల్ నంబర్ డాటాబేస్ కు రాండమ్ గా ఫోన్లు చేస్తూ పాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు. ఈ సదుపాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం విజయవాడలో ప్రారంభిస్తున్నారు.     
    
ఈ మెగా కాల్ సెంటర్ ను 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నార.  మొత్తం 1200 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తారు. ఏపీ ప్రణాళికా సంఘం ఈ కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను ఎనాల్సిస్ చేస్తుంది కూడా.  దీనికి సంబంధించి మొత్తం టెక్నికల్ సపోర్టును కార్వీ సంస్థ అందిస్తోంది.
    
కాగా టీడీపీ నేతలు దీనిపై చేస్తున్న ప్రచారం కరెక్టు కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో ఇంకే రాష్ర్టంలోనూ ఇలాంటి కాల్ సెంటర్ లేదని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే... ఇటీవల యూపీ ఎన్నికలకు ముందు అప్పటి అఖిలేశ్ ప్రభుత్వం ఇదే పేరుతో మెగా కాల్ సెంటర్ అన్న పేరుతో ఏర్పాటు చేశారు. గత ఏడాది సెప్టెంబరులో లక్నోలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ మెగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏపీలోనూ అదే కాన్సెప్టును చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/